తీవ్ర తుపానుగా మారిన పెథాయ్‌.. ప్రభావంపై ఉత్కంఠ


పెథాయ్‌ తీవ్ర తుపాను(సూపర్ సైక్లోన్) గా మారింది. సోమవారం మధ్యాహ్నం ఇది కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తాజా హెచ్చరిక (ఉదయం 6 గంటలకు). ఆ సమయానికి కూడా ఇది తీవ్ర తుపానుగానే ఉంటుందా లేక బలహీనపడి తుపానుగా మారి తీరం దాటుతుందా అన్న దానిని బట్టి దీని ప్రభావం ఆధారపడి ఉంటుంది. తీవ్ర తుపానుగా ఉంటే గాలుల తీవ్రత గంటకి 90 కి.మీ నుంచి 110 కి.మీ వరకు ఉండవచ్చని అంచనా. ‘పెథాయ్‌’ తీరానికి చేరువ అవుతుండటంతో ప్రభుత్వం అన్ని శాఖలను సమాయత్తం చేసింది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ప్రమాదం పొంచి ఉంది. అక్కడి యంత్రాంగాన్ని సర్కార్ అప్రమత్తం చేసింది. పరిస్థితిని సమీక్షించడానికి కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలతో పాటు విద్యుత్తు శాఖకు చెందిన 2వేల మందిని మోహరించింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు జాలర్లు సముద్రంలో చిక్కుకున్నారు. వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. గంటకు 28 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న తుపాను తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు వంద కిలోమీటర్లకు చేరడంతో పాటు 22 మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్కడి ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించాలని జిల్లాల కలెక్టర్లకు స్పష్టంచేసింది. సీఎం చంద్రబాబు ఆదివారం కలెక్టర్లు, అధికారులతో తుపాను పరిస్థితిపై సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రాబోయే 48 గంటలు అప్రమత్తంగా ఉంటూ సహాయ చర్యల్లో పాల్గొనాలని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా, ఆదివారం ఉదయం నుంచి కోస్తా తీరంలోని జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అలల తీవ్రత పెరిగి కొన్నిచోట్ల సముద్రం ముందుకు వచ్చింది. మబ్బులు పట్టడంతో పాటు జల్లులు కురిశాయి. రాత్రంతా వానలు పడ్డాయి. ఇకపోతే తీవ్రమైన శీతల వాతావరణం నెలకొని చలిగాలులు వీచాయి. కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా గరిష్ఠంగా.. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లిలో 23.5 మి.మీ, అమలాపురంలో 23 మి.మీ వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట, హంసలదీవి, బాపట్ల, బోగాపురం, ఉప్పాడ తదితర ప్రాంతాల్లో 50 అడుగులకు పైగా ముందుకు వచ్చింది. ఈదురుగాలుల ధాటికి దివిసీమ ప్రాంతంలో సుమారు 10 వేల ఎకరాల్లోని కోత కొచ్చిన వరి పడిపోయింది. నిజాంపట్నం ఓడరేవులో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని 17 మండలాలపై తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. 283 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో నర్సాపురం, ఆచంట తదితర మండలాల్లో వర్ష ప్రభావం కన్పించింది. పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్లు ప్రకటించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించే మీ కోసం కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఆర్డీవో, తహసీల్దార్లకు అత్యవసర నిధులు అందుబాటులో ఉంచారు. నిత్యావసరాలను మండల కేంద్రాలకు తరలించారు. భారీ వర్షం కురిసినా సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా జనరేటర్లు సమకూర్చారు. పునరావాస కేంద్రాల వద్దనే వంటలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ముఖ్యాంశాలు