స్వయం సహాయక బృందాలకు పారిశ్రామిక వికాసం


సమాజ అభివృద్ధికి మహిళా సాధికారత అత్యంత కీలకమని గుర్తించి రెండు దశాబ్దాల కిందటే తాను స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశానని, 90 లక్షల మంది ఈ గ్రూపుల్లో చేరి చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటూ ఆర్థికంగా బలపడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇప్పుడు వారిని పారిశ్రామికులుగా బలోపేతం చేసే కృషి కొనసాగుతుందన్నారు. బుధవారం విశాఖపట్నంలో భారత మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య (ఎలీప్‌), దక్షిణాసియా మహిళాభివృద్ధి ఫోరం (ఎస్‌.ఎ.డబ్ల్యు.డి.ఎఫ్‌.) ఆధ్వర్యంలో ప్రారంభమైన అంతర్జాతీయ మహిళా పారిశ్రామి కవేత్తల సదస్సులో ఆయన ప్రసంగించారు. 18 శాఖల పరిధిలో 1900 ఎంవోయూలు కుదిరాయని, వీటిద్వారా రూ.13.47 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి 10 లక్షల మందికి ఉద్యోగాలొచ్చాయని త్వరలో వీటి సంఖ్య 30 లక్షలకి పెరుగుతుందని అన్నారు. గడచినా రెండున్నర సంవత్సరా ల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలద్వారా రూ.11వేల కోట్ల పెట్టుబడులొచ్చాయని, 2.85 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించాయని తెలిపారు. రాష్ట్రంలో 175 పారిశ్రామిక టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విధి నిర్వహణలో పురుషుల కన్నా మహిళలే ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తారని సీఎం ప్రశంసించారు. తమ ఇంట్లో ఆర్థిక సంబంధ వ్యవహారాలన్నింటినీ భార్య, కోడలికే తాను అప్పగించానని తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారని, రాబోయే రోజుల్లో మహిళలను కట్నం ఎదురిచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. వచ్చే నెలలో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకి 50 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతరణి, ఆ సందర్భంగా సదస్సులో మహిళలకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిది ద్దడంలో ఎలీప్‌ 25 సంవత్సరాలుగా చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. విశాఖలో ఇప్పటికే ఎలీప్‌కు ఇచ్చిన ఐదెకరాల భూమికి అదనంగా మరో 50 ఎకరాలను ఇస్తామన్నారు. 21 రోజుల్లో పరిశ్రమలకు అన్ని రకాల అనుమతులు ఆన్‌లైన్లో ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ కార్యదర్శి బినయ్‌ కుమార్‌, సార్క్‌ సెక్రటరీ జనరల్‌ అంజాద్‌ హుస్సేన్‌, మంత్రులు అమరనాథ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఎంపీలు హరిబాబు, మురళీ మోహన్‌, ప్రపంచ వాణిజ్య సంస్థ ఈడీ రత్నాకర్‌ అధికారి, ఎస్‌.ఎ.డబ్ల్యు.డి.ఎఫ్‌. అధ్యక్షురాలు ప్రమీలా ఆచార్య రిజాల్‌ పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం