హుందాగా వ్యవహరించిన భోపాల్ ఎంపీ అలోక్ !


హెల్మెట్ పెట్టుకోకుండా ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఒక ఎంపీకి ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేశారు. దానికి ఆ ఎంపీ మారు మాట్లాడకుండా ఫైన్ చెల్లించారు. అంతే కాదు.. బహిరంగంగా ట్విట్టర్ ద్వారా తాను హెల్మెట్ పెట్టుకోకపోవడం తప్పిదమని అంగీకరిస్తూ మరోసారి ఇలా చేయనన్నారు. క్షమాపణలు కూడా చెప్పారు. ఆయనే భోపాల్ ఎంపీ అలోక్ సంజార్. బిజెపి కి చెందిన సంజార్ సోమవారం నిర్వహించిన ‘ఏక్తామ్ యాత్ర’లో పాల్గొన్నపుడు హెల్మెట్ లేకుండా బైక్ నడిపారు. ఓంకారేశ్వర్‌లో ఏర్పాటు చేయనున్న 108 అడుగుల ఆది శంకరాచార్య విగ్రహం కోసం విరాళాలు సేకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈ యాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా భోపాల్ ఎమ్మెల్యే సురేంద్ర నాథ్ సింగ్‌తో కలిసి ఎంపీ హెల్మెట్ లేకుండా బండి నడిపారు. ఇది గమనించిన ఓ ప్రయాణికుడు ఫొటో తీసి ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబరుకు పంపాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినందుకు గాను ఎంపీ అలోక్‌కు రూ.250 జరిమానా విధించారు. తప్పును అంగీకరించిన ఎంపీ హుందాగా రూ.250 ఫైన్ కట్టేసి మరోసారి ఇలా చేయనంటూ క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆయన ట్విట్టర్ లో ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. జీపు చెడిపోవడంతో తాను బైక్ పై ప్రయాణం చేసానని.. అయితే తొందరలో హెల్మెట్ విషయం మరచిపోయాననని తెలిపారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానన్నారు.

ముఖ్యాంశాలు