ఆధార్ పై భయాందోళనలు అనవసరం!

ఆధార్ సమాచారం పూర్తిగా భద్రంగానే ఉందని, ఏమాత్రం దుర్వినియోగానికి ఆస్కారం లేదని ది యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఉడాయ్) తన వెబ్ సైట్ లో వివిధ సందేహాలు, సమాధానాల రూపంలో పంచుకున్న సమాచారం ద్వారా తెలిపింది. ఇటీవల ఆధార్ సమాచారాన్ని రూ.500కు విక్రయిస్తున్నారన్న పుకార్లపై స్పందనగా ఈ సమాచారం పెడుతున్నట్టు పేర్కొంది. ఆధార్‌కు అనుసంధానమై ఉండే బ్యాంక్ ఖాతా, పాన్, బయోమెట్రిక్ సమాచారం ఆధారంగా ఆ వ్యక్తి కార్యకలాపాలపై నిఘాకు ఆస్కారం లేదంది. ఆధార్‌లో కేవలం పేరు, చిరునామా, పుట్టిన తేదీ తదితర ప్రాథమిక సమాచారం, 10 వేలి ముద్రలు, రెండు ఐరిస్‌లు, ఫోకల్ ఫొటోగ్రాఫ్ , మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ మాత్రమే ఉంటాయని, మిగిలిన ఏ వివరాలు డేటాబేస్‌లో ఉండవని తెలిపింది. ఫోన్ నెంబర్లు, షేర్లు, మ్యూచ్‌వల్ ఫండ్స్, బ్యాంక్ ఖాతాలు తీసుకునే సమాచారం ఉదయ్ కి రాదని పేర్కొంది. ఆయా అవసరాలకు ఆధార్ నెంబర్ ఇచ్చినప్పుడు సదరు కంపెనీ ఆ వ్యక్తి గుర్తింపును పరీక్షించుకోవడానికి మాత్రమే ఆ సమాచారం ఉపకరిస్తుందని పేర్కొంది. పిన్ నెంబర్లను ఎవరితోనూ పంచుకోనంత కాలం ఆధార్ నంబర్ తెలిసినా కూడా బ్యాంక్ ఖాతాలు భద్రంగా ఉంటాయని తెలిపింది. ఇతరులు మన పేరుతో సిమ్ కార్డులను తీసుకొని దుర్వినియోగం చేయకుండా మాత్రమే ఫోన్ కి ఆధార్ అనుసంధానం చేస్తున్నట్టు పేర్కొంది. మనీ లాండరింగ్ నేరగాళ్లు, ఉగ్రవాదులు పక్కవారి నెంబర్లతో కార్యకలాపాలను నిర్వహిస్తారని వెల్లడించింది. మొబైల్ కంపెనీలకు వేలిముద్రను ఇచ్చినప్పుడు అది ఎన్క్రిప్టెడ్ డేటా రూపంలో ఉడాయ్‌కు చేరుతుందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లో దాచిపెట్టకూడదని మొబైల్ కంపెనీలు, బ్యాంకులకు ఆదేశాలు ఉన్నాయని ఉడాయ్ పేర్కొంది. ఎన్ఆర్ఐలకు ఆధార్ అవసరంలేదని, అలాగే వారు ఆధార్ పొందేందుకు అనర్హులని స్పష్టం చేసింది.