హజ్ సబ్సిడీ రద్దు సముచితమే !


ఏ మతంలో అయినా తీర్థ యాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. భక్తులు ఇష్ట దైవాన్ని దర్శించుకొని మొక్కు చెల్లించుకుంటారు. ఈ యాత్రల కోసం తమ కష్టార్జితం నుంచి కొంత మొత్తం పక్కన పెట్టుకోవడం ఆనవాయితీ.. దురదృష్టవశాత్తు ఈ యాత్రలపై దశాబ్దాల క్రితమే రాజకీయ కన్ను పడింది.. ఆయా వర్గాలను ప్రసన్నులను చేసుకోవడానికి ప్రభుత్వాలు నిధులు ఇవ్వడం మొదలు పెట్టాయి.. ఇందులో భాగమే ముస్లింలకు హజ్ యాత్ర సబ్సిడీ.. కొన్ని రాష్ట్రాల్లో క్రైస్తవులకు జెరూసలేం యాత్ర సబ్సిడీ కూడా మొదలు పెట్టారు. దీన్ని చూసి మెజారిటీ మతస్తులైన హిందువులు తమ తీర్థ యాత్రలకు ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వకపోగా, పన్నులు వేయడాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్ర సబ్సిడీ నిలిపివేయడం ఆహ్వానించదగిన పరిణామం. నిజానికి ఈ సబ్సిడీ ఇస్లాం వ్యతిరేకం అని గతంలో ఆ మతానికి చెందిన ప్రముఖులు, ఎంపీలు కూడా స్పష్టం చేశారు.. కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే యాత్ర చేయాలి, తప్ప ఇతరుల దాయాదక్షిణ్యాల సొత్తుతో హజ్ వెళ్లొద్దని వారి వాదన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హిందూ మత ఉత్సవాలు, జాతరలు, కుంభమేళాలకు డబ్బు ఖర్చు చేయడాన్ని ఈ సందర్భంగా కొందరు మేతావులు తప్పు పడుతున్నారు.. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గ్రహించాలి.. ఈ యాత్రలకు పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు హాజరవుతున్నారు కనుక వారికి సౌకర్యాలు, భద్రత కల్పించడం ప్రభుత్వ విధి. ఏ మతానికి సంబంధించిన ఉత్సవాలు అయినా ప్రభుత్వాలపై ఈ బాధ్యత ఉంటుంది. కాగా హజ్ యాత్ర సబ్సిడీ నిలిపి వేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏటా రూ.700 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. ఈ సొమ్మును ముస్లిం బాలికా విద్యపై ఖర్చు చేయడం సముచిత నిర్ణయమే.

- Krantidev Mitra, Hyderabad

ముఖ్యాంశాలు