ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక


కర్ణాటకపై బిజెపి అధినాయకత్వం పెట్టిన దృష్టికి ఫలితాలు మొదలయ్యాయి. అక్కడ వలసలు, బీజేపీలో చేరికలు షురూ అయ్యాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారని, త్వరలో జరిగే ఎన్నికల్లో బిజెపి అఖండ మెజారిటీతో గెలుస్తుందని అన్నారు. గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఎన్నికల్లోపు మరింతమంది బీ జేపీలోకి వస్తారని యడ్యూరప్ప చెప్పారు. ఎన్నికలు ఉన్నందున పూర్తి స్థాయి బడ్జెట్‌ చట్టవిరుద్ధమని అయన అన్నారు. మూడు నెలలకు గాను ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని అన్నారు. ఎన్నికల ముందు ఈ మూడు నెలల్లో ఏకంగా రూ. 80 వేల కోట్లు ఖర్చు చేసి లబ్ధి పొందాలని పాలకపక్షం చూస్తున్నదని ఆరోపించారు. కాగా జేడీఎస్‌లో తమకు ప్రాధాన్యం లేనందువల్లనే బీజేపీలో చేరుతున్నట్టు ఇద్దరు ఎమ్మెల్యేలు తెలిపారు. స్పీకర్‌ కేబీ కోళివాడ్‌ అందుబాటులో లేకపోవడంతో గురువారం శాసనసభ కార్యదర్శి ఎస్‌.మూర్తికి జేడీఎస్‌ ఎమ్మెల్యేలు వజ్జల్, పాటిల్‌ తమ రాజీనామా లేఖలను అందజేశారు. ఏడాది కాలంగా జేడీఎస్‌ అధినాయకత్వం తమను పక్కన పెట్టిందని వారిద్దరూ ఆరోపించారు. అయితే జేడీఎస్‌ ఎమ్మెల్యేల రాజీనామా లేఖలను అందుకునేందుకు శాసనసభ కార్యదర్శి మూర్తి నిరాకరించి వీటిని స్పీకర్‌కే సమర్పించాలని సూచించారు. అయితే స్పీకర్‌తో మాట్లాడినట్లు, స్పీకర్‌ అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖలు ఇవ్వాలని చెప్పినట్టు చెబుతూ వారు ఆయన టేబుల్ పై లేఖలు పెట్టి వెళ్లిపోయారు.

ముఖ్యాంశాలు