ఇండియన్ రీడర్ షిప్ సర్వే -2017 విశేషాలివీ


ప్రతిరోజూ 1,58,48,000 మంది పాఠకులు ‘ఈనాడు’ చదువుతున్నారని ‘ఇండియన్‌ రీడర్‌షిప్‌ సర్వే-2017’లో తేలింది. ప్రాంతీయ భాషా పత్రికల్లో దేశంలో ఈనాడు నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. పాఠకుల సంఖ్య పరంగా మొత్తం అన్ని పత్రికల్లో దేశంలోనే తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ సర్వే ఫలితాల్లో హిందీ, ప్రాంతీయ భాషా పత్రికలదే హవా. ఆంగ్ల పత్రికలను తోసిరాజని మొదటి 10 స్థానాలనూ అవే ఆక్రమించడం విశేషం. విశేష వృద్ధిని నమోదు చేసుకుంటూ గత నాలుగేళ్లలో 11.2 కోట్ల మంది కొత్త పాఠకుల్ని ఈ వార్తా పత్రికలు సంపాదించగలిగాయి. దీంతో మొత్తం పాఠకుల సంఖ్య 40.7 కోట్లకు చేరుకుందని ఐ.ఆర్‌.ఎస్‌. వెల్లడించింది. వీటిలో హిందీ పత్రికలస్థానం అమోఘం. ఆ పత్రికల పాఠకులు 45% పెరిగి 17.6 కోట్లకు చేరారు. అదే సమయంలో ఆంగ్ల పత్రికల పాఠకులు 10 శాతమే పెరిగి 2.8 కోట్లకు చేరారు. దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న దైనిక్‌జాగరణ్‌ పత్రికకు 7,03,77,000 మంది పాఠకులున్నారు. ఆ తర్వాత స్థానాల్లో హిందుస్థాన్‌ (5,23,97,000), అమర్‌ ఉజాలా (4,60,94,000), దైనిక్‌ భాస్కర్‌ (4,51,05,000), దినతంతి (తమిళం-2,31,49, 000), లోక్‌మత్‌ (మరాఠీ-1,80,66,000), రాజస్థాన్‌ పత్రిక (1,63,26,000), మలయాళ మనోరమ (1,59,99,000), ఈనాడు (1,58,48,000), ప్రభాత్‌ కబర్‌ (1,34,92,000) ఉన్నాయి. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా (1,30,47,000) 11వ స్థానంలో నిలిచింది. చివరిసారిగా 2014లో ఐఆర్‌ఎస్‌ నివేదిక రాగా అప్పటికి పాఠకుల సంఖ్య 29.5 కోట్లు. 2017 ఏడాదికి సంబంధించి, 3.2 లక్షల ఇళ్ల నుంచి వివరాలు సేకరించి నివేదిక రూపొందించారు. ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్స్‌ (ఏబీసీ), మీడియా రీసెర్చ్‌ యూజర్స్‌ కౌన్సిల్‌ (ఎంఆర్‌యూసీ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన రీడర్‌షిప్‌ స్టడీస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఎస్‌సీఐ) ఈ అధ్యయనం నిర్వహించింది. 12 ఏళ్లు పైబడినవారిలో పాఠకుల సంఖ్య 9% చొప్పున పెరుగుతూ వస్తోంది. ఈ సర్వే నివేదిక ప్రకారం భారతీయుల్లో (12 ఏళ్లు పైబడినవారు) 39% మంది వార్తాపత్రికలను చదువుతున్నారు. అరకోటి పైబడిన జనాభా ఉన్న నగరాల్లో మొత్తం పాఠకుల్లో 20% మంది ఆన్‌లైన్లో పత్రికల్ని చూస్తున్నారు.

ముఖ్యాంశాలు