అజ్ఞాతవాసికి లార్గో విన్చ్‌ యూనిట్ లీగల్ నోటీసు!


అజ్ఞాతవాసి సినిమా బృందానికి చిక్కులు తప్పేలా లేవు. ఇప్పటికే అట్టర్ ప్లాప్ టాక్ మూటగట్టుకున్న ఈ సినిమాకి కలెక్షన్లు బాగానే ఉండడం కాస్త ఊరట కలిగించింది. అయితే ఆ సంతోషం కూడా నిలవకుండా ఈ చిత్రంపై కాపీ ముద్ర పడిపోయింది. దీనిపై అజ్ఞాతవాసి చిత్ర బృందానికి లీగల్‌ నోటీసులు పంపుతామని ఫ్రెంచ్‌ దర్శకుడు జెరోమి సలే తాజాగా పేర్కొన్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రానికి హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. ఫ్రెంచ్‌ హిట్‌ ‘లార్గో విన్చ్‌’ ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఫ్రెంచ్ ‌సినిమా హక్కులను టీ-సిరీస్‌ తీసుకుందని, ‘అజ్ఞాతవాసి’ నిర్మాతలు టీ-సిరీస్‌తో ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నారని అజ్ఞాతవాసి బృందం చెప్పుకొచ్చింది. ఈ చిత్రాన్ని ఫ్రెంచ్ దర్శకుడు జెరోమి సలే వీక్షించి బాగుందని కితాబు ఇచ్చారు. అయితే ఇది దాదాపు తన ‘లార్గో విన్చ్‌’లాగే ఉందని ఆయన సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. తమ చిత్రాన్ని కాపీ చేసిన విషయంలో గతవారం రోజులుగా ‘అజ్ఞాతవాసి’ బృందం మౌనం వహిస్తోందని, ఇక ఇప్పుడు తాము లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటున్నామని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. లీగల్‌ నోటీస్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఆయన జత చేశారు. దీనికి సమాధానంగా ఓ వ్యక్తి ‘అజ్ఞాతవాసి’ నిర్మాతలు, టీ-సిరీస్‌ పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసుకోవచ్చుగా అని ట్వీట్ చేయగా సలే స్పందిస్తూ అది సాధ్యం కాదన్నారు.

ముఖ్యాంశాలు