యెడ్యూరప్ప అస్త్ర సన్యాసం


ఆట పూర్తి కాకుండానే యడ్యూరప్ప వెనుదిరిగారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యాబలం లేని భాజపా తమ ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి గోల్‌మాల్‌ వ్యవహారాలకు తెరదీసిందని విరుచుకుపడి, తుదికంటా పోరాడి, వ్యూహాత్మకంగా ఎత్తులు వేసిన కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌) కూటమికే అంతిమంగా అధికారం దక్కింది. ఈ నెల 15న కర్ణాటక శాసనసభ ఫలితాలు వెలువడిన నాటి నుంచి మొదలయిన నాటకీయ పరిణామాలకు శనివారం సాయంత్రం తెరపడింది. అధికారం దక్కే పరిస్థితి కనబడకపోగా పరువు పోయే దుస్థితి ఎదురవడంతో యడ్యూరప్ప రాజీనామా చేసారు. విశ్వాస పరీక్ష నెగ్గే అవకాశం కనబడకపోవడంతో బలపరీక్షకు వెళ్లకుండానే ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జేడీ(ఎస్‌) నేత కుమారస్వామికి గవర్నర్‌ నుంచి ఆహ్వానం అందింది. బుధవారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. యడ్యూరప్ప ప్రభుత్వ బల నిరూపణ కోసం సుప్రీంకోర్టు ఆదేశానుసారం కర్ణాటక శాసనసభ శనివారం ఉదయం సమావేశమైంది. ప్రొటెంస్పీకర్‌గా కె.జి.బోపయ్య నియామకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌) కూటమి చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు శనివారం తోసిపుచ్చడంతో ఆయనే ప్రొటెం స్పీకర్‌గా విధులు నిర్వర్తించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇటీవల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో ఆయన ప్రమాణం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప, అనంతరం విపక్ష నేత స్థానంలో ఆశీనులైన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రమాణం చేశారు. సాయంత్రం సభ్యుల ప్రమాణాలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి యడ్యూరప్ప విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘ఈ సభ శ్రీ బి.ఎస్‌.యడ్యూరప్ప గారి నాయకత్వంలోని మంత్రివర్గం పట్ల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తోంది’ అన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వెంటనే పది నిముషాల పాటు భావోద్వేగంతో ప్రసంగించారు. ఆ తీర్మానంపై సభ నిర్ణయాన్ని కోరలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సభ్యుల సంఖ్యాబలం లభించనందున ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘నేను విశ్వాస పరీక్షను ఎదుర్కోను. రాజీనామా చేయబోతున్నాను.’’ అని సభాముఖంగా ప్రకటించారు. ఆ వెంటనే సభను నిరవధికంగా వాయిదా వేసినట్లు తాత్కాలిక సభాపతి బోపయ్య ప్రకటించారు. సభ నుంచి నేరుగా రాజభవన్‌కు వెళ్లిన యడ్యూరప్ప.. గవర్నర్‌ వజుభాయీ వాలాకు రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం