రాష్ట్రాలు సై అంటే జీఎస్టీ పరిధిలోకి పెట్రోలు

పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకు రావడానికి అభ్యంతరాలు ఏమీ లేవని, కేంద్రం దీనికి సుముఖంగానే ఉన్నదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదని ప్రతిపక్ష నేతలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ జైట్లీ ఏమన్నా రంటే ‘గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలోకి చేర్చకుండా ముసాయిదాను ప్రవేశపెట్టింది. వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమస్యలు వస్తాయని వారికి తెలుసు." అన్నారు. పెట్రోలి యం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రాలు కూడా మద్దతు ఇస్తాయని తాము వేచి చూస్తు న్నాం అన్నారు. రాష్ట్రాలు అంగీకరిస్తే త్వరలోనే దీన్ని అమలులోకి తెస్తామని చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల జీఎస్టీ మండలి సభ్యుడు, బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా వివిధ సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.