చంద్రబాబు చాణక్యం... నిఖార్సయిన రాజకీయం!


ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుత హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. విభజన తర్వాత నవ్యాన్ద్ర తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిన చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిది సంవత్సరాలు సీఎం.... పదేళ్లకు పైగా ప్రతిపక్షనేత. సీఎంగా రెండు గోదావరి పుష్కరాలు చూసిన అదృష్టవంతుడు. ఏ మామనైతే దెబ్బతీసి (వెన్నుపోటు అంటారు కొందరు!) ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారో అదే మామ బొమ్మతో ఎన్నికలకు వెళ్లి మళ్ళీ మళ్ళీ గెలిచిన మొనగాడు. తనకు కలిసివస్తుందంటే ఎవరినైనా అక్కున చేర్చుకుంటారు.. లాభం లేదనుకుంటే ఠక్కున విసిరేస్తారు. రాజకీయ ప్రయోజనాన్ని మించి తన పర భేదం అంటూ లేని నిఖార్సయిన రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు. అవును.. ఆయన పక్కా ప్రొఫెషనల్. బిజెపిని దగ్గరకు తీసుకున్నా. దూరం పెట్టినా.., కమ్యూనిస్టులను కావలించుకున్నా, ఈసడించుకున్నా..., మోదీని హోరున విమర్శించినా.. ఆకాశానికెత్తేసినా.., జూనియర్ ఎన్టీఆర్ ని లాలించినా.. ఆనక పట్టించుకోకపోయినా .., పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లి మరీ బుజ్జగించి ప్రచారం చేయించుకున్నా.. విభజనకి సై అని లేఖ రాసినా.. రెండు రాష్ట్రాలు రెండు కళ్ళని పాట పాడినా... అసాధ్యం అని తెలిసినా అంతు లేని వాగ్దానాలు చేసినా.. ప్రపంచం విస్తుపోయే రాజధాని కోసం ఇంకా డిజైన్లు కూడా ఖరారు చేయని కృషిని నాలుగేళ్లుగా అదే దీక్షతో కొనసాగిస్తున్నా... పోలవరం ప్రాజెక్ట్ పై తన లెక్కలు తనవే అన్నట్టు అనుబంధ పథకాలకు కేంద్ర నిధులు మళ్లించినా.., కేంద్రం డబ్బులతో తన సొంత పేరుతో పథకాలు అమలు చేసినా.., ఒకపక్క రాష్ట్రాన్ని అభ్యుదయపథంలో పరుగులు తీయిస్తున్నానని గణాంకాలు వల్లించి మరోపక్క బీద అరుపులు అరిచినా...ఇలా ఎన్ని చేసినా ఆయన అంతిమ పరమార్థం రాజకీయమే! రాజకీయ ప్రయోజనం లేదనుకుంటే బాబు కనీసం కంటితో కూడా చూడరు... అదే పనికొస్తుంది అనుకుంటే అక్కున చేర్చుకోవడానికి వెనుకాడరు! అదే చంద్రబాబు చాణక్యం! తాజాగా ఆయన బిజెపి పై ప్రకటిస్తున్న యుద్ధం కూడా అందులో భాగమే. బిజెపి వలన తనకు కలిసి వస్తుందంటే ఆయన ఆ పార్టీతో ఉంటారు గానీ.. తనవలన ఆ పార్టీకి లాభం అనుకుంటే మాత్రం కాదు! ఒట్టిపోయిన గేదెను పోషించే రకం కాదు చంద్రబాబు. ఇప్పుడు ఆయన దృష్టిలో రాష్ట్రంలో బిజెపి గెలుపు గుర్రం కాదు! అందుకే తన మేధా శక్తి ఉపయోగించి ప్రజల దృష్టిలో బిజెపిని ఎలా పలచన చేయాలో అలా చేస్తున్నారు! ప్రజల ప్రమేయం లేకుండా విభజన చేశారు. అందరితో మాట్లాడి న్యాయం చేయాలని నేను చెప్పినా పట్టించుకోలేదు. అన్యాయం జరిగిందని అందరూ చెబుతున్నారు. కానీ ఇప్పుడు న్యాయం చేయమంటే ఆలస్యం చేస్తున్నారు. హైదరాబాద్‌లో కష్టపడి పని చేసి, అక్కడ అభివృద్ధి చేసాం. తిరిగి ఇక్కడ నేనే కష్టపడాల్సి వస్తోంది. హైదరాబాద్‌ను తెలంగాణకు ఇవ్వడంవల్ల మనం కోల్పోయేదాన్ని కేంద్రం సర్దుబాటు చేయాలి. విభజన చట్టం ప్రకారం అన్నీ చేయాలి. రాష్ట్రానికి తగిన న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా వెనుకాడం! అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తగాదాలు పెట్టుకొని వెనకబడిపోవడం ఎందుకని మాత్రమే తాను సంయమనం వహిస్తున్నానని కూడా చెప్పారు. ఏపీ ప్రజలు చేతకానివాళ్లేం కాదని మన వారికి ఎంతో సామర్థ్యం ఉందని చెబుతూ ఆ రోజు పాలకులు తీసుకున్న నిర్ణయం వల్లే ఇక్కడ ఉన్న 5 కోట్లమంది ఇబ్బందుల పాలయ్యారని బాబు స్పష్టం చేశారు. అయితే విచిత్రంగా నాడు విభజనలో తాను కూడా పాత్రధారినే అనే విషయాన్నీ ఆయన పట్టించుకోరు! దటీజ్ చంద్రబాబు!! రాష్ట్రం ఏదీ అదనంగా కోరడంలేదని చట్టంలో ఉన్నవాటినే నెరవేర్చమంటున్నామని స్పష్టం చేశారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో తలసరి ఆదాయంలోనూ, అభివృద్ధిలోనూ ఆంధప్రదేశ్‌ సమానస్థాయికి చేరే వరకూ చేయూతనిచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి గానీ... కోర్టుకి వెళతాం అనడంలో ఉన్న బెదిరింపు, ముందుచూపు మనం పరిశీలిం చాలి! కేంద్రం రాష్ట్రానికి ఎంత ఇచ్చిందో చెబుతున్నది. నిధుల పక్కదారి విషయాన్ని కూడా పరోక్షంగా ధృవీకరిస్తున్నది. అయితే అందుకు సహకరించింది.. ఆ అవకాశం ఇచ్చిందీ కూడా కేంద్రమే అనేది నిర్వివాదం. ఇప్పుడు ఏడెనిమిది నెలల్లో ఎన్నికల వరకు వచ్చేసారు. ఇంతకాలం కలిసి చేసిన కొన్ని తప్పిదాలకు విడివిడిగా నెపాలు మోపుకోవడం... విజయాలకు సమష్టిగా.. ఇంకా చెప్పాలంటే తమ గొప్పే అని బాజా వేసుకోవడం బిజెపి, తెదేపా చేస్తున్న పనులు. ఇందులో స్వతహాగా చంద్రబాబు చాలా ముందుంటారు. ఎందుకంటే ఆయనకు ఇది బాగా తెలిసిన కళ. ఇప్పుడాయన అదే చేస్తున్నారు. పోలవరం పనులు సాగకపోవడం, రాజధానికి ఇంకా డిజైన్లు కూడా ఖరారు కాకపోవడం ఆయన పరంగా జరిగిన పెద్ద వైఫల్యాలు. అయితే కేంద్రం తప్పిదాలు లేవా అంటే.. విభజన చట్టం పూర్తిగా అమలు పర్చడం, వీలైతే ప్రత్యేక హోదా ఇవ్వడం.. లేదా నిజాయితీగా ఆ విషయం చెప్పి ప్యాకేజీ కింద ఆ నష్టాన్ని భర్తీ చేయడం జరగాలి. కానీ బిజెపి కూడా కొన్ని పొరపాట్లు చేసింది. పూర్తిగా బాబుకి ఉపయోగపడి తన గుడ్ విల్ ని ఆ పార్టీ రాష్ట్రంలో కోల్పోయింది. చేతులారా బిజెపిని తెదేపా ఈ రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా బాడ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడిక తప్పులన్నీ ఆ పార్టీ నెత్తిన వేసి పోరాట యోధుడి ఇమేజ్ తో బయటకు వచ్చేయాలన్నదే చంద్రబాబు వ్యూహం కావచ్చు. ఆయనతో జట్టు కట్టడానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, వామపక్షాలు సిద్ధంగానే ఉన్నాయి. ఆరకంగా మరో మహాకూటమి తో ముందుకు పోవాలనేది ఆయన తాజా ఆలోచన కావచ్చని విశ్లేషకుల అంచనా!

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం