బ్రహ్మవిద్యను బోధించే గజేంద్రమోక్షం


(శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో సోమవారం రాత్రి ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి 18 వ ప్రసంగం )

ఎన్నెన్నో భాగవత సత్యాలను, వ్యాసమహర్షి హృదయాన్ని ఆవిష్కరిస్తూ అత్యద్భుతంగా సాగిపోతున్నది బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞం. భగవంతుని యెడల శరణాగతి, ఇంద్రియ నిగ్రహం, మహాత్ములను ఆశ్రయించడం అనే మూడిటితో కూడిన భాగవత మార్గమే జన్మతారకమని పేర్కొన్నారు. బ్రహ్మచారి అయినా, గృహస్థయినా, వానప్రస్థుడైనా, సన్యాసి అయినా ఆ ఆశ్రమ నియమాలు పాటించకపోతే భ్రష్టుడే అవుతాడని, మోక్షం కోరుకునేవారికి ఇట్టివారి సాంగత్యం కూడా తగదని భాగవతం చెబుతున్నదన్నారు. సోమవారం రాత్రి 18వ నాటి ప్రవచనంలో భాగంగా సామవేదం వారు గజేంద్రమోక్షాన్ని అందుకున్నారు. నాల్గవ మన్వంతరమైన తామస మన్వంతరంలో జరిగిన గజేంద్ర మోక్ష ఘట్టాన్ని పరీక్షిన్మహారాజు వినతి మేరకు శుకమహర్షి విస్తారంగా వివరించాడన్నారు. వివిధ మన్వంతరాల్లో భగవానుడు చూపిన మహిమలు, విభూతులను, వాటిద్వారా తరించిన భాగవతోత్తముల గాధలను భాగవతం వివరిస్తున్నదని ఈ సందర్భంగా సామవేదం తెలిపారు. గజేంద్ర మోక్షణ ఘట్టం భాగవత సారంగా గుర్తింపు పొందిందని, దీనిని శాస్త్రం చెప్పిన పంచరత్న గీతల్లో ఒకటిగా పరిగణిస్తారని తెలిపారు. పంచరత్న గీతల్లో భారతం నుంచి భగవద్గీత, విష్ణు సహస్రనామస్తోత్రం, శాంతిపర్వంలో భీష్మకృత భీష్మస్తవరాజం (విష్ణుస్తవం), అనుస్మృతి ప్రకరణం ఉండగా, బాగవతం నుంచి ఒకే ఒక్క ఘట్టం గజేంద్రమోక్షం ఉన్నదని వెల్లడించారు. గజేంద్రమోక్షం తెలియనిదెవరికి? కానీ నిజంగా తెలుసా? అనే ప్రశ్నను ఈనాటి ప్రవచనం రేకెత్తించింది. మొసలి పట్టునుంచి తనను విడిపించమని గజేంద్రుడు ప్రార్థించాడా? విష్ణువును ఆయన స్తుతించాడా? ఈ రెండు ప్రశ్నలకూ కాదనే సమాధానం చెప్పుకోవాలని బ్రహ్మశ్రీ సామవేదం పేర్కొంటూ ఒక సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. గజేంద్రుడు తన ప్రార్థనలో ఎక్కడా మొసలి బారినుంచి తనను రక్షించమని కోరలేదని... ఆయన ఎక్కడా విష్ణువు, శివుడు, కృష్ణుడు అనే మాట, వర్ణన, నామం లేకుండా నిర్గుణ, నిరాకార పరబ్రహ్మాన్ని మాత్రమే స్తుతించాడని తెలిపారు. అందుకే ఈ ప్రార్థన వైదికంగా అత్యున్నతస్థాయిని పొందిందన్నారు. భగవానుడి ఆర్తత్రాణపరాయణతను చాటే గొప్ప ఘట్టంగా గజేంద్రమోక్షాన్ని వివరించే పరమోత్సాహంలో... గజేంద్రుడి ప్రార్థనలోని గొప్పతనాన్ని చాలామంది పట్టించుకోరు. కానీ అది వ్యాసహృదయం. అందుకే గజేంద్రమోక్షంలో ఆ విశిష్ట కోణాన్ని, నిర్విశేష బ్రహ్మస్తుతిగా సాగిన గజేంద్రుని ప్రార్థనలోని అద్భుత విశేషాలను జనరంజకంగా సామవేదం వారు వివరించారు. గొప్ప బ్రహ్మతత్వ విచారణ ఈ ప్రార్థనలో ఉండడం చేతనే దీనికి భగవద్గీతతో సమానమైన ప్రాధాన్యం కలిగిందని సూత్రీకరించారు. ఆర్తి చేత భగవానుడ్ని ఆశ్రయిస్తే తక్షణం ఆయన ఆదుకుంటాడనే మౌలిక విషయాన్ని గజేంద్రమోక్షం ద్వారా అర్థం చేసుకోవడం బాహ్యంగా సరిపోతుందని, అయితే భాగవతాన్ని మోక్షశాస్త్రంగా భావించి సాధన చేసేవారు మాత్రం గజేంద్రుని ప్రార్థన విశేషాన్ని, ఆయన ఎవరిని, ఏ రీతిన ప్రార్థిస్తే.. ఎవరు ఎలా కదిలివచ్చారనే సత్యాన్ని గ్రహించడం అవసరమన్నారు. దారిద్య్రం, అనారోగ్యం, అపకీర్తి, శత్రుబాధ ఈ నాలుగు జీవితాన్ని దుర్భరం చేస్తాయి గనుక వీటినుంచి విముక్తి కోసం భగవానుడ్ని ఆశ్రయించడం తప్పేమీ కాదన్నారు. ఇవి ధార్మికమైన వాంఛలే గనుక ఈ విధమైన ఆర్తితో భగవానుడ్ని కోరితే ఆయన తప్పక అనుగ్రహిస్తాడన్నారు. పూర్వపుణ్యవిశేషం ఎంత ఉన్నప్పటికీ భగవదనుగ్రహం చేతనే ఈ సమస్యలు లేని ఉత్తమజీవనం అనుగ్రహింపబడుతుందని పేర్కొన్నారు. దైవానికి చేసిన ప్రార్థన వృథా పోదని, దేవుడికి మొక్కిన మొక్కు వ్యర్థం కాదని ప్రతిఒక్కరూ తెలుసుకోవాన్నారు. ప్రారబ్ధం చిన్నదైతే తప్పిస్తాడని, ఒకవేళ అనుభవించక తప్పని గతి ఉంటే దానిని తట్టుకునే శక్తిని ఆయనే ప్రసాదిస్తాడని విశ్లేషించారు. గజేంద్రమోక్ష ఘట్టాన్ని వివరిస్తూ.. కథాక్రమాన్ని ఇలా వివరించారు. క్షీరసాగరాన ఉన్న త్రికూట పర్వత ప్రాంతంలో ఈ కథ జరిగిందని చెబుతుందన్నారు. ఇక్కడ వరుణుడి అధీనంలోని వనం ఉందని, దానిలో ఆడ ఏనుగుల మందతో సంచరిస్తున్న గజేంద్రుడు అలా విహరిస్తూ అనేక చెట్లను పెకలించివేశాడని పేర్కొన్నారు. అనంతరం స్వర్ణ కమలాలతో ప్రకాశించే సరోవరంలో ఆ ఏనుగుల గుంపు దిగి జలాల్ని కల్లోలం చేసిందన్నారు. ఆ సమయంలో ఒక మొసలి ప్రారబ్ధ వశాన గజేంద్రుని కాలు పట్టుకొందని... దానినుంచి విడిపించుకునేందుకు ఎంతో పోరాడి, ఎంతో ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో గజేంద్రుడు ఆర్తితో భగవానుడ్ని ఆశ్రయించాడన్నారు. ఈ కథ నిజంగా జరిగినదే అయినా ఇందలి వర్ణన, విశేషాలకు అనుగుణంగా సంకేతాత్మకంగా యోగపరిభాషలో చెప్పిన అంశాలను కూడా అర్థం చేసుకోవడం సముచితమన్నారు. సాగరమే సంసారమని, త్రికూటంలోని మూడు శిఖరాలు (బంగారు, వెండి, ఇనుము) త్రిగుణాలని, ఏనుగు జీవుడని, వాడిని పట్టిన మొసలి మోహం అని అంటూ... ఈ కథలోని ప్రధానాంశం దేవుని ఆర్తత్రాణ పరాయణత మాత్రమే కాక జీవుని వేదన కూడా అని ప్రతిపాదించారు. గజేంద్రుని బాధ ఇప్పటికీ లోకంలో అనేకులు అనుభవిస్తున్నా, మోక్షం మాత్రం ఏ కొద్దిమందికో సిద్ధిస్తున్నదన్నారు. సన్నివేశం మాత్రమే కాక స్తోత్రాన్ని కూడా ఇక్కడ పట్టించుకుంటే నిజతత్త్వం అర్థమవుతుందన్నారు. ఈ స్తోత్రం వల్లనే ఈ ఘట్టానికి బ్రహ్మవిద్యాస్థానం లభించిందన్నారు. ఈ స్తోత్ర పారాయణ మహిమ అనితరమన్నారు. ఎవరు పఠించినా దీనికి గొప్ప యోగం సిద్ధిస్తుందనేది నిస్సంశయమన్నారు. దేవతలు, సిద్ధులు సంచరించే ప్రదేశంగా పేర్కొన్న ఈ వన పర్వత ప్రదేశంలో నిరంతరం పుష్పించి ఫలించే యాభైనాలుగు వృక్షజాతులను గురించి వర్ణించారన్నారు. వీటిని ధ్యానించడం వలన కూడా ఆధ్యాత్మిక ఫలితం లభిస్తుందన్నారు. ఆలోచించే శక్తి లేని ఏనుగు ఇలా ప్రార్థించి, భగవానుడ్ని ఆశ్రయించగదా? అనే సందేహం పలువురికి కుగుతుందని అంటూ... ఆలోచనాశక్తి ఉన్న మానవుల్లో అనేకమందికి ఆ స్పృహ లేకపోవడం ఎంత నిజమో... ఒకానొక ఏనుగుకు ఆ స్పృహ కలగడమూ అంతే నిజమన్నారు. ఉపాధిని మాత్రం కాక జీవుని సంస్కారాన్ని ఇక్కడ చూడాలన్నారు. పైగా పూర్వజన్మ సుకృతం, అనుస్మృతి ఇందుకు దోహదం చేశాయన్నారు. గజేంద్రమోక్ష ఘట్టం వివరణలో మూలములోని వ్యాసువారి శ్లోకాలు, పోతనగారి అనువాద పద్యాలు కూడా అత్యద్భుతమన్నారు. వీటిని పిల్లల చేత చదివిస్తే వారిలో ప్రాణశక్తి వృద్ధి పొంది ఆయువు పెరుగుతుందని చెప్పారు. సంసారమనే కాసారంలో పడిన జీవుడు అవసరాన్ని మించి అందులో మమేకమైపోతే... అత్యాశతో మిడిసి అంతా కల్లోలం చేస్తే ఎదురయ్యే పరిణామాల్ని గజేంద్రమోక్ష కథ సంకేతాత్మకంగా చెప్పిందన్నారు. చాలామందికి మోహం అనే మొసలి పట్టుకుందనే స్పృహ లేకుండానే జీవితం గడిచిపోతుందని, కొందరు గుర్తించి దానితో పోరాడుతారని, ఇంకొందరు అలా పోరాడి విజయం సాధించి ముక్తులవుతారని ప్రతిపాదించారు. ఇక్కడ గజేంద్రుడు మొసలి బారినుంచి బయటపడేందుకు పోరాటం సాగించాడని, ఆపైన తన శక్తి ఇందుకు చాలదనే సత్యాన్ని గమనించినవాడై పరమాత్మకు శరణాగతి చేశాడన్నారు. మహాత్ములు కష్టాను కూడా తరింపజేసే అవకాశాలుగా మార్చుకుంటారన్నారు. ఇప్పుడు గజేంద్రుడు కూడా అదేపని చేశాడని సామవేదం వారు తెలిపారు. దశలక్షకోటి ఆడ ఏనుగులతో కూడిన వాడు అని భాగవతం చెబితే ఇదెక్కడి లెక్క అనే కుతర్కం లేవనెత్తే పండితులకు సామవేదం సరైన సమాధానం చెబుతూ దశ ఇంద్రియాలతో అనుభవించే లక్షల, కోట్ల విషయవాంఛలనే ప్రతీకాత్మకంగా ఇలా చెప్పారన్నారు. అంతర్ముఖుడనై శాశ్వతానందం అనుభవించక, బాహ్య ఆనందం వైపు ఇలా ఎందుకు వచ్చాను.. ఎందుకీ మోహం బారిన పడి, విషయవాంఛల్లో పడి ఎందుకు బంధితుడనయ్యాననే ఆవేదనే గజేంద్రునిలోని జీవుడి నిజమైన వేదన అనే సంగతిని ప్రతీకాత్మక కథలో గుర్తించాలన్నారు. విచారణకు శరణాగతికి మధ్య ఉన్న శ్లోకం ద్వారా నిత్యానిత్యవివేచనను వ్యాసుల వారు తెలిపినతీరు ఎంతో అర్థవంతమని.. అది పట్టుకుంటే తత్వం తెలుస్తుందని చెప్పారు. హృదయం పరమాత్మ స్థానం, అందులో మనస్సును ఉంచి, అందు నిశ్చయాత్మకమైన బుద్ధిని గజేంద్రుడు లయంచేసి దాన్ని పరమాత్మయందు లగ్నం చేశాడని... ఈ జ్ఞానాన్ని హృదయానికి బుద్ధి తగగానే పరమాత్మయే స్ఫురింపజేశాడన్నారు. వాచిక మానసిక క్రియలు రెండూ కలిస్తే జపం అవుతుందని, ఇక్కడ గజేంద్రుడు అదే చేశాడని అందుకే స్తోత్రం.. మంత్రమై... అది జపంగా మారిందని విశ్లేషించారు. నిజమైన పరబ్రహ్మ తత్వాన్ని అన్వేషిస్తూ.. విచారిస్తూ సాగిన ఈ స్తుతి తదేకంగా.. సూటిగా ఆ పరబ్రహ్మాన్నే వ్యక్తం చేస్తూ ఆయననే చేరుకుందన్నారు. ఈ ప్రార్థనను సర్వవేదాంత సారం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదని సామవేదం ప్రవచించారు. గజేంద్రుని స్తుతిలోని కనీసం రెండు శ్లోకాలనైనా నిత్యం పఠిస్తే సద్గతులు కలుగుతాయని ఉపదేశించారు. పూర్ణపురుషుడు, ఆదిమూలమైన వాడు అయిన ఎవరి వలన ఈ జగత్తు కలిగి ఎవనియందు చైతన్యవంతం అవుతున్నదో, ఈ ప్రపంచాకృతిలో తానుండి, ప్రపంచానికి ఆవలనూ తానున్న అట్టి భగవానుడికి నమస్కరిస్తున్నానని గజేంద్రుడు తెలిపాడన్నారు. సాగరంలో కెరటాలు పుడతాయి.. అయితే అవి సాగరంలోనే ఉన్నాయి. సాగరంలో ఒకానొక వాయు సంచలనం చేత ఆవిర్భవిస్తున్నాయి. కెరటాలు వేరు సముద్రం వేరూ కాదు. సాగరం పరమాత్మ అనుకుంటే కెరటాలు జీవులు, వాయువు మాయ అనబడుతుందని శంకరాచార్యుని ప్రతిపాదనగా తెలిపారు. ఎవరి కారణంగా ఉద్భవించి జగత్తు ఎవరి యందు, ఎవరి అధీనంలో ఉన్నదో వాడే పరమాత్మ అని ప్రతిపాదించే ఈ స్తోత్రంలో జగత్తు ఆధారంగా జగదీశ్వరుడ్ని తెలుసుకునే పరమసత్యం ప్రతిపాదితమైందన్నారు. నామగుణరూపవిశేషాలు లేని శుద్ధ భగవత్‌ స్వరూపానికి ఇంతకుమించిన నిర్వచనం మరెక్కడా కనిపించదని సామవేదం వారు అభిప్రాయపడ్డారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు