కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి


కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా జనతాదళ్‌ శాసనసభాపక్ష నేత హరదనహళ్లి దేవెగౌడ కుమారస్వామి 23 వ తేదీ బుధవారం ప్రమాణం చేస్తారు. ఆరోజు బెంగళూరు శ్రీకంఠీరవ క్రీడా ప్రాంగణంలో ప్రమాణాన్ని చేయనున్నారు. తొలుత సోమవారం మధ్యాహ్నం మధ్యాహ్నం 12-1.50 మధ్య ప్రమాణస్వీకారం ఉంటుందని ఆయన చెప్పినా తర్వాత బుధవారం ప్రమాణం చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 21న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి అయినందున ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బుధవారానికి మార్చినట్లు జేడీ(ఎస్‌) నేత ఒకరు చెప్పారు. కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడకు జ్యోతిష్యంపై ఉన్న నమ్మకమూ తేదీ మార్పునకు ఒక కారణమని జేడీ(ఎస్‌) వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ వజుభాయీ వాలా నుంచి అందిన ఆహ్వానం మేరకు శనివారం రాత్రి కుమారస్వామి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్‌తో సంప్రదింపులు జరిపారు. అనంతరం కుమారస్వామి విలేకర్లతో మాట్లాడుతూ 15 రోజుల్లోగా బలాన్ని నిరూపించుకోవాలని తనకు గవర్నర్‌ సూచించినప్పటికీ అంతకు ముందే ఆ పని చేస్తామని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం సవ్యంగా సాగేందుకు రెండుపార్టీల ప్రముఖులతో కలసి సమన్వయ సమితిని ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ నేతృత్వంలో చర్చిస్తామని, ఆదివారం ఆ వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సోనియా, రాహుల్‌, మాయావతి, గులాంనబీ ఆజాద్‌ తదితర నేతలకు, రెండు పార్టీల శాసనసభ్యులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మున్ముందు కూడా భాజపా ఆపరేషన్‌ కమలం నిర్వహించే అవకాశం ఉన్నందున ఆ పరిస్థితి ఉద్భవించకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటామని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం