విశాఖకు రానున్న ఐఎన్ఎస్ విరాట్


కురుసుర జలాంతర్గామి, టీయూ 142 యుద్ధ విమానం నెలకొని ఉన్న విశాఖ పట్నానికి ఇప్పుడు ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌక కూడా చేరనుందని సమాచారం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నౌకాదళ సేవల నుంచి నిష్కృమించిన విరాట్ యుద్ధ నౌకను వచ్చే ఏడాదిన్నర లోగా విశాఖ సాగర తీరంలో పర్యాటక ప్రదర్శనశాలగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది.ఈ నౌకను జాతీయ స్థాయి మెరైన్‌ మ్యూజియంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు పర్యాటక వారసత్వ బోర్డు ఆమోద ముద్ర వేసింది. దిల్లీలోని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వశాఖ ఉన్నతాధి కారులతో పలుమార్లు సమావేశమైన రాష్ట్ర అధికారులు విశాఖ పర్యాటకానికి ఉన్న ప్రాధాన్యాన్ని వారికి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ. వెయ్యి కోట్ల భారీ వ్యయం తొలుత అంచనా వేసినా, ఇప్పుడది రూ. 300 కోట్లుకి కుదించారు. విరాట్ నౌకను నిలపాలంటే 18 ఎకరాల స్థలం అవసరం. దీన్ని అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనశాలగా మార్చేందుకు పార్కింగ్‌ ప్రాంతం, విన్యాసాల వేదికలు, ఇతర హంగులను సమకూర్చాలి. ఇవన్నీ ఉండాలంటే 500 ఎకరాల స్థలం కావాలని అంచనా. విరాట్‌ నౌకలోని గదులను స్టార్ హోటల్‌గా మార్చడంతోపాటు వాణిజ్య పరంగానూ వినియోగించుకుంటే పర్యాటకులు ప్రత్యేక అనుభూతి పొందుతారని, ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు విశాఖలో జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంగణం వాటికీ ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. యుద్ధ విమాన వాహన నౌక పైనుంచి హెలి టూరిజం నడపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల విశాఖ పర్యటనలో సూచించిన విషయం విదితమే.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం