పాక్ అణు బాంబుకి టైమొచ్చేసింది - సయీద్

అమెరికాపై పాకిస్థాన్‌కు చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది సయీద్ హఫీజ్ జిహాద్(పవిత్ర యుద్ధం) ప్రకటిస్తున్నట్లు బహిరంగంగా హెచ్చరించాడు. అంతే కాకుండా అతడు ఆ దేశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ముంబయి ఉగ్రదాడి ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ అమెరికా, ఇజ్రాయిల్‌పై జిహాద్ ప్రకటిస్తూ లాహోర్‌లో ర్యాలీ చేపట్టాడు. ఇందులో జమాత్-ఉద్-దవా నేత అబ్దుల్ రెహమాన్ మఖ్కీ కూడా పాల్గొన్నాడు. ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలెంను అమెరికా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీకి పిలుపునిచ్చినా దీని వెనుక ప్రధాన ఉద్దేశం మాత్రం కొత్త సంవత్సరం రోజున ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై నిరసనే అని స్పష్టమైంది. పాకిస్థాన్‌కు 15ఏళ్లలో 33బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సాయం ఇచ్చినా ఒరిగింది ఏమీ లేదని, అక్కడి నాయకులు అబద్ధాలు చెప్పి నమ్మక ద్రోహం చేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సయీద్ రెచ్చిపోయాడు. పాకిస్థాన్ అణుబాంబును వినియోగించాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. హఫీజ్‌ను పాకిస్థాన్ వెనుకేసుకొస్తోంది. అతడిని అరెస్టు చేయడంలోనూ జాప్యం చేస్తోంది. పాకిస్థాన్ అణ్వాయుధం ఇస్లాం ఆస్తి. జెరూసలెం విషయంలో దీన్ని ఉచితంగా వాడవచ్చని సయీద్ అన్నాడు. ఇస్లామిక్ దేశాల చీఫ్‌లతో సదస్సు ఏర్పాటు చేసి జిహాద్ ప్రకటిస్తున్నాం అని చెప్పాడు. ఐసిస్ ప్రభావం అంతరిస్తున్నదని, జీహాద్ అంతానికి అమెరికా కుట్రలు చేస్తుందని సయీద్ ఆందోళన చెందాడు. సయీద్‌పై పాకిస్థాన్ మోపిన అభియోగాలు కోర్టులో రుజువుకాకపోవడంతో ఇటీవల అతను విడుదలై బయటకు వచ్చాడు. భారత్ అతడిని అప్పగించమంటున్నా పాక్ ఒప్పుకోవడంలేదు. ఈ తరుణంలో సయీద్ మిల్లి ముస్లిం లీగ్(ఎంఎంఎల్) పార్టీని స్థాపించి 2018లో పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తున్నాడు. కాగా జామాత్-ఉద్-దవా నేత అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ హిందూ, క్రిస్టియానిటీలపై పోరాటానికి అల్లా పూర్తి శక్తినిస్తాడని ఆకాంక్షించాడు.