ట్రంప్ వ్యాఖ్యలపై రగిలిన పాకిస్థాన్


పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగా తయారైందని, తమనుంచి నిధులను పొందడం కోసం అబద్ధాలు చెప్పి మోసం చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడడంపై పాకిస్థాన్‌ కూడా తీవ్రంగానే స్పందించింది. ఆఫ్గనిస్థాన్‌లో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అమెరికా ఎంచుకున్న బాటగా ఈ ఆగ్రహాన్ని పాక్ ఎద్దేవా చేసింది. దీనిపై పాక్‌ విదేశాంగ కార్యాలయం అమెరికా రాయబారికి సమన్లు పంపిందని డాన్‌ పత్రిక పేర్కొంది. అయితే ఈ అత్యవసర భేటీ అజెండాను మాత్రం వెల్లడించలేదు. ట్రంప్‌ వ్యాఖ్యలపై పాక్‌ రక్షణ, సమాచార మంత్రులు కూడా ట్విట్టర్‌ లోనే స్పందించి దీటైన విమర్శలు చేశారు. అమెరికాకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాం, ప్రపంచానికి నిజాలు తెలియజేస్తాం అని హెచ్చరించారు. ట్రంప్‌ ఆగ్రహపూరిత వ్యాఖ్యలు వెలువడిన గంటల్లోనే ట్రంప్‌ యంత్రాంగం పాక్‌కు 255 మిలియన్‌ డాలర్ల సైనిక సహాయాన్ని నిలిపివేసింది. ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ తీసుకునే చర్యలను బట్టే ఈ సాయం ఉంటుందని తెలిపింది.

ముఖ్యాంశాలు