అమరావతికి 1500 కోట్లు ఇచ్చాం : కేంద్రం


అమరావతికి ఇప్పటి వరకూరూ.1500 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పి.రాధాకృష్ణన్‌ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాల నిర్మాణానికి, రాష్ట్ర విభజన చట్టంలో ప్రకటించిన విధంగా, ఈ నిధులు మంజూరు చేసినట్లు మంత్రి లిఖిత పూర్వకంగా తెలిపారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాల నిర్మాణానికి ఇప్పటి వరకూ రూ.1580 కోట్లు ఖర్చు చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నీతిఆయోగ్‌కు తెలిపిందని ఆ సమాధానంలో పేర్కొన్నా రు. ఇదిలా ఉంటె గతంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కె నారాయణ మాట్లాడుతూ రాజధాని నిమిత్తం మంజూరైన నిధులను గుంటూరు జిల్లాలో డ్రైన్లు, రోడ్ల అభివృద్ధికి వ్యయం చేసినట్టు తెలిపారు.. అలాగే ప్రస్తుతం రాజధాని ఏరియాలో జరిగిన నిర్మాణాలకు 1580 కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి లేదని కూడా పరిశీలకులు అంటున్నారు. హైకోర్టు, సచివాలయం, శాసనసభ భవనాలకు ఇంకా డిజైన్లే ఖరారు కాకుండా నిర్మాణాలకు 1580 కోట్లు ఎలా వెచ్చిస్తారనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతోంది. మొత్తానికి రాజధాని విషయమై కేంద్ర, రాష్ట్రాల లెక్కలు వేల కోట్లు దాటిపోతున్నా.. అక్కడ పనులు మాత్రం ఆ స్థాయిలో జరగలేదనేది అందరి మాటగా ఉంది. కాగా అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణంపై కూడా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. రూ.3,324 కోట్ల రుణం అంశం ప్రపంచ బ్యాంకు పరిశీలనలో ఉందని అయన తెలిపారు. ఏదైనా నిర్మాణానికి అయ్యే ఖర్చులో ప్రపంచ బ్యాంకు 70శాతం నిధులు ఇస్తుందని, మిగిలిన 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవాలని ఆయన తెలిపారు.

ముఖ్యాంశాలు