ఇక బోర్డింగ్ పాస్ విధానానికి సెలవు

విమానాశ్రయాల్లో ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించడం కోసం బోర్డింగ్ పాస్ విధానానికి స్వస్తి పలకాలని విమానయాన భద్రతా ఏజెన్సీలు భావిస్తున్నాయి. బోర్డింగ్ పాస్‌ల స్థానంలో బయోమెట్రిక్‌తో కూడిన ఎక్స్‌ప్రెస్ చెక్–ఇన్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు భోగట్టా. దేశంలోని 17 ఎయిర్‌పోర్ట్‌ల్లో హ్యాండ్‌బ్యాగేజ్ ట్యాగ్ల విధానానికి విమానయాన భద్రతా ఏజెన్సీలు ఇటీవల స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే త్వరలో 59 విమానాశ్రయాల్లో బోర్డింగ్ కార్డు రహిత విధానాన్ని అమలులోకి తేవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వదలని అనుకుంటున్నారు. విమానాశ్ర యాల్లో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సొల్యూషన్ వ్యవస్థ ప్రవేశపెట్టడం ద్వారా ప్రస్తుతం ఉన్న భద్రతా సంస్థలన్నింటినీ అనుసంధానించాలని, బయోమెట్రిక్, వీడియో ఎనలిస్టిస్ సిస్టమ్ వంటి సాంకేతిక వ్యవస్థలను వినియోగించాలని ప్రతిపాదించారు. బోర్డింగ్ పాస్ రహిత ప్రయాణం ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రారంభించారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన విధానం ప్రకారం.. దేశీయ విమానయాన ప్రయాణికులు టెర్మినల్ బిల్డింగ్‌కు వెలుపల ఉండే సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌ల నుంచి బోర్డింగ్ పాస్ ప్రింటవుట్‌ను తీసుకుంటారు. ఆ తర్వాత చెక్ ఇన్ ఏరియాలోకి వెళ్లకుండా నేరుగా ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ చెక్ లేన్‌లోకి చేరుకోవచ్చు. అక్కడి నుంచి బోర్డింగ్ ఏరియాకు వెళతారు.