ఐసిఐసిఐ బ్యాంకు నికర లాభం రూ.2058 కోట్లు


జూలై- సెప్టెంబరు త్రైమాసికంలో స్టాండలోన్‌ ప్రాతిపదికన ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.2,058 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.3,108 కోట్లతో పోలిస్తే లాభం 33% తగ్గింది. అయితే ఐపీఓ రూపేణా, జీవిత బీమా సంస్థలో (ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌) వాటా విక్రయించడం వల్ల రూ.5,600 కోట్లు రావడం ఆ సమయంలో లాభం ఎక్కువ రావడానికి కారణం. ఈసారి సాధారణ బీమా కంపెనీ (ఐసీఐసీఐ లాంబార్డ్‌) వాటా విక్రయం ద్వారా రూ.2,100 కోట్లు సమకూరాయి. ఈ త్రైమాసికంలో రుణాల్లో 6.3 శాతం వృద్ధి ఉండటంతో నికర వడ్డీ ఆదాయం 9 శాతం పెరిగి రూ.5,709 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌ 0.14 శాతం పెరిగి 3.27 శాతానికి చేరింది. నికర వడ్డీయేతర ఆదాయం ఏడాది క్రితం నాటి రూ.9,120 కోట్లతో పోలిస్తే, ఈసారి తగ్గి రూ.5,186 కోట్లుగా నమోదైంది. రుసుముల ఆదాయం పెరిగింది. కొత్త ఎన్‌పీఏలు రూ.4,634 కోట్లు: సమీక్ష త్రైమాసికంలో కొత్తగా రూ.4,634 కోట్లు మొండి బకాయిలుగా మారడంతో స్థూల నిరర్థక ఆస్తులు 7.87 శాతానికి పెరిగాయి.

ముఖ్యాంశాలు