తూర్పు పర్యాటకాభివృద్ధికి కేరళ ఊతం

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక వనరులను వినియోగించి, ఉపాధి కల్పించటానికి చేపట్టిన చర్యల్లో భాగంగా శుక్రవారం రాత్రి కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా కేరళ రాష్ట్రానికి చెందిన బృందంతో భేటీ అయ్యారు. ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకూ సంయుక్త కలెక్టర్‌ మల్లికార్జున, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కార్వనిర్వాహక సంచాలకులు జి.భీమశంకరరావు కేరళ రాష్ట్రంలో పర్యటించారు. కొచ్చిన్‌, కొమరకం, అలెప్పీ, తెక్కం, వెంబనాడు లేక్‌ ప్రాంతాల్లో బోటు ఆపరేటర్లు, బోటు బిల్డర్స్‌, పెట్టుబడిదారులతో సంప్రదింపులు చేపట్టి పర్యాటక అభివృద్ధికి అవసరమైన అంశాలను చర్చించారు. ఈమేరకు వీరిని జిల్లాకు ఆహ్వానించారు. దీంతో 11 మందితో కూడిన బృందం శుక్రవారం జిల్లాకు చేరుకుంది. వీరు రాజమహేంద్రవరం సమీపంలోని పిచ్చుకలంక, కేతావానిలంక, కోటిలింగాలఘాట్‌లను పరిశీలించారు. గోదావరిలో బోటుపై వెళ్లి ఈ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కాకినాడ చేరుకుని కలెక్టర్‌తో భేటీ అయ్యారు. జిల్లాలో అనేక పర్యాటక వనరులు ఉన్నాయని, వీటిని పరిశీలించి, ఇక్కడ పర్యాటక ప్రాజెక్టులు పెట్టాలని కలెక్టర్‌ ఆహ్వానించారు. మరో మూడు రోజులపాటు జిల్లాలోని పర్యటించి, పర్యాటక అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. సోమవారం దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని సూచించారు. జిల్లాలో పర్యాటకానికి పూర్తి తోడ్పాటును అందిస్తామని, జిల్లాలో 3 వేల మందికి ఉపాధి కల్పించటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ బృందం సోమవారం మళ్లీ కలెక్టర్‌తో సమావేశమై చర్చిస్తుందని అధికారులు తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం