పాక్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
పాకిస్థాన్ తీవ్రవాద అనుకూల చర్యలపై అగ్రరాజ్యాల దృష్టి పడేట్టు చేయడంలో... వాటినించి ఒత్తిడి పెరిగేలా చేయడంలో భారత సర్కారు సఫలం అయింది. ఇటీవల నిధులు, ఆయుధ సహకారం విషయంలో కొత్త పెట్టిన అమెరికా తాజాగా పాక్ కు ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాద సంస్థలపై పాక్ చర్యలు తీసుకోకపోతే.. తామే వేరే మార్గంలో వెళ్లాల్సి వస్తుందని యూఎస్ విదేశాంగశాఖ మంత్రి టిల్లర్సన్ శుక్రవారం హెచ్చరించారు. 75 మంది కరడుగట్టిన ఉగ్రవాదుల జాబితాను, హక్కానీ నెట్వర్క్కు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాక్ అధికారులకు అందిస్తూ యుఎస్ ఈ హెచ్చరిక చేసింది. మీది సార్వభౌమాధికారం కలిగిన దేశం. ఏం చేయాలనేది మీరే నిర్ణయించుకోండి. కానీ దాని అవసరం అర్థం చేసుకోండి. మీరు చేయలేకపోతే.. చేయలేమని చెప్పండి. మీరు చేయలేని దానిని, వేరే వ్యూహాల ద్వారా మేము చేస్తాం’ అని టిల్లర్సన్ గట్టి హెచ్చరిక చేశారు. ఇటీవల పాక్లో టిల్లర్సన్ పర్యటించిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా పాక్ ప్రధానమంత్రి అబ్బాసీతో పాటు ఆర్మీ జనరల్ బజ్వాతోను ఆయన సమావేశమయ్యారు. ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా మారిందని, వాళ్లని నియంత్రించకపోతే ఆ దేశమే ప్రమాదంలో పడుతుందని గతంలో కూడా టిల్లర్సన్ అన్నారు. కాగా అసలు యూఎస్ నుంచి తమకెలాంటి జాబితా రాలేదని పాక్ విదేశాంగశాఖ మంత్రి ఖవాజా అసిఫ్ ఇప్పుడు మరోసారి బుకాయించడం విశేషం.