భారత మహిళా క్రికెట్ పై యుకె పార్లమెంట్ లో సదస్సు


ఇండియన్ ఫోరమ్ ఫర్ బ్రిటిష్ మీడియా ఆధ్వర్యంలో ఇటీవల యుకె పార్లమెంట్ భవనంలో ఒక విశేష కార్యక్రమం జరిగింది. భారతీయ మహిళా క్రికెట్ విశిష్టతను చాటి చెప్పే ఉద్దేశంతో బ్రిటిష్ పార్లమెంట్ కమిటీ రూమ్ లో కిక్కిరిసిన ప్రతినిధులతో ఒక వర్క్ షాప్ నిర్వహించారు. దీనికి ఎంపీ ఎం వీరేంద్ర శర్మ ఆధ్వర్యం వహించారు. భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన విజయాలను, ప్రదర్శించిన పరిణితిని ఆయన కొనియాడారు. లార్డ్స్ మైదానంలో జరిగిన మహిళా వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు ప్రపంచ కప్ గెలవలేకపోయినా క్రీడాభిమానుల హృదయాలను గెలుచుకుంది అన్నారు. ఫోరమ్ అధ్యక్షుడు ప్రభాకర్ కాజ ప్రసంగిస్తూ ఈ సదస్సు ఉద్దేశాలను, ఫోరమ్ లక్ష్యాలను వివరించారు. బ్రిటిష్ మీడియా లో భారత దేశానికి సంబంధించిన వార్త విశేషాల పరంగా ఫోరమ్ చేస్తున్న కృషిని అయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత మహిళా క్రికెట్ జట్టుపై ప్రజాదరణను మరింత పెంచడం ద్వారా ఆ జట్టు ఆడే మ్యాచుల సంఖ్యను పెంచాలని భావిస్తున్నామన్నారు. భారత మహిళా క్రికెట్ అభిమానుల పేస్ బుక్ పేజీ లో ప్రతి ఒక్కరూ సభ్యులు కావాలని అయన కోరారు. అనేక పుస్తకాలను రచించిన మిహిర్ బోస్ మాట్లాడుతూ భారత మహిళా క్రికెట్ జట్టులో కెప్టెన్ మిథాలీరాజ్ పోషిస్తున్న కీలక భూమికను ప్రశంసించారు. ఎంసిసి కమిటీ మెంబర్ ఇసాబెల్ డంకన్, అసోసియేట్ ప్రొఫెసర్ ప్రశాంత్ కిడంబి, మాజీ క్రికెటర్ కమల్ ప్రభాకర్, వ్యాఖ్యాత భారతి దేశరాజు తదితరులు ప్రసంగించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం