ఆర్థిక వ్యవస్థను మోడీ నాశనం చేసారు - చిదంబరం


Chidambaram

దేశ ఆర్థిక వ్యవస్థను నరేంద్ర మోడీ ప్రభుత్వ సంస్కరణలు సర్వ నాశనం చేశాయని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నట్లయితే రూ.6లక్షల కోట్లతో భారత్‌మాల కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. బ్యాంకులకు మూలధనాన్ని ఎందుకు సాయం చేస్తున్నారని నిలదీశారు. పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) దారుణ పాలనా వైఫల్యాలని ఓ ఇంటర్వ్యూలో ఆయన దుయ్యబట్టారు. 2004- 2009 మధ్య భారత వృద్ధి రేటు 8.5 శాతం ఉందన్నారు. 2014 తర్వాత వృద్ధి రేటులో తిరోగమనం మొదలైందని చిదంబరం అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని పదే పదే ఆర్థికమంత్రి జైట్లీ చెబుతున్న మాట శుద్ధ అబద్ధమన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల దేశ వృద్ధిరేటు మందగించిందని చిదంబరం అన్నారు. ఈ చర్య వల్ల ఒరిగింది మాత్రం శూన్యమన్నారు. నల్లధనం ఏమాత్రం బయటపడలేదని, పరిస్థితి ఎప్పటిలాగానే ఉందని అన్నారు. దీనికి తోడు పెద్దనోట్ల రద్దు వల్ల చిన్న, మధ్య తరహా వ్యాపారులు చితికిపోయారని చెప్పారు. ఈ జీఎస్టీలో వివిధ రకాల శ్లాబులు ఉన్నాయని, దీని ‘జీఎస్టీ’ అని కాకుండా వేరే పేరుతో పిలవాలని వ్యాఖ్యానించారు.

ముఖ్యాంశాలు