జగ్గయ్యపేట మున్సిపాలిటీ వైకాపా పరం

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ విషయంపై ఉత్కంఠ వీడింది. వైకాపా నేత ఇంటూరి రాజగోపాల్‌ అలియాస్‌ చిన్నా ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. తెదేపా సభ్యుల బహిష్కరణతో ఛైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. సమావేశంలో కోరం ఉండటంతో రాజగోపాల్‌ను ఛైర్మన్‌గా రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. అనంతరం చిన్న ప్రమాణ స్వీకారం చేసారు. జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైౖర్మన్‌ ఎన్నిక ప్రక్రియ శుక్రవారం ఉత్కంఠగా మొదలై తీవ్ర ఉద్రిక్తత మధ్య వాయిదా పడింది. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య సహా తెదేపా సభ్యులంతా ఎన్నికల అధికారి ముందు నాలుగు గంటల పాటు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన విజయవాడ ఆర్డీవో హరీష్‌ ఎట్టకేలకు ఎన్నికను శనివారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అడుగడుగునా అనూహ్య పరిణామాల మధ్య మొదలైన ఎన్నికకు వైకాపా ఛైర్మన్‌ అభ్యర్థి ఇంటూరి చిన్నా సహా 16 మంది సభ్యులు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్యతో సహా మొత్తం 11 మంది తెదేపా సభ్యులు హాజరయ్యారు. ఇద్దరు తెదేపా కౌన్సిలర్లను ఇంటూరి చిన్నా అపహరించారని ఆయనపై నమోదైన కేసులను ప్రస్తావించడంతో పాటు తమను మార్గమధ్యలో వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయభాను, అతని అనుచరులు అడ్డుకుని రాళ్లు రువ్వారని ఆరోపిస్తూ ఎన్నిక వాయిదా వేయాలని తెదేపా సభ్యులంతా ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. అపహరణకు గురైన తమ సభ్యులు వచ్చేంత వరకు ఎన్నికను జరగనివ్వబోమని పట్టుపట్టారు. ఎన్నికకు అవసరమైన కోరం ఉన్నందున వాయిదా సాధ్యం కాదని ఆర్డీవో చెప్పినా వారు ఆందోళన విరమించలేదు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ అక్కడ బల్లలను పడేశారు. ఆర్డీవో ముందు ఉన్న బల్లపై కొడుతూ, ఆయన కుర్చీని కూడా నెట్టేశారు. ఒక దశలో ఆర్డీవో మాట్లాడే మైక్‌ వైరును లాగి పడేశారు. ఉద్రిక్తతను నిలువరించేందుకు ఒకసారి అరగంట, మరోసారి పావుగంట పాటు ప్రక్రియను వాయిదా వేశారు. తదుపరి శనివారానికి ఎన్నిక వాయిదా వేశారు.

ముఖ్యాంశాలు