పోలవరంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు : కన్నబాబు


Kurasala Kanna babu

పోలవరం ప్రాజెక్ట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని, ఆయన డ్రామాలాడుతున్నారని వైఎస్సార్ సిపి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పొలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయే దుస్థితి నెలకొందని కన్నబాబు తెలిపారు. ఏ ప్రయోజనాలు ఆశించి ప్రాజెక్టును అడ్డుకుంటున్నారో చెప్పాలని అయన డిమాండ్ చేసారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేని స్థితిలో ఉన్న బాబు ప్రతిపక్షంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ దేశానికి వెళ్తే ఆ దేశంగా అమరావతిని మారుస్తానని బాబు గాలి కబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. రాజధానిలో ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ భవనాన్ని కూడా నిర్మించలేకపోయారన్నారు. ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారు, ఎందరు నిరుద్యోగులకు ఉపాధి కల్పించారో శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రం కోసం విదేశాలకు వెళ్లానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఎన్ని కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారో చెప్పాలని కూడా సవాల్ విసిరారు.