జెట్ ఎయిర్‌వేస్‌ విమానానికి ఉగ్ర బెదిరింపులు


Jet Airways

ముంబయి - దిల్లీ జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానానికి ఉగ్ర బెదిరింపులు రావడంతో అత్యవసరంగా దారి మళ్లించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇది ముంబయి నుంచి దిల్లీ బయల్దేరింది. కొద్దిసేపటికే విమానాన్ని దారి మళ్లించి 3.45గంటల ప్రాంతంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశారు. విమాన టాయిలెట్‌లో ఒక బెదిరింపు లేఖను సిబ్బంది గుర్తించారు. ‘విమానంలో హైజాకర్లు ఉన్నారు. మొత్తం 12 మంది ఉన్నారు. విమానాన్ని దిల్లీలో ల్యాండ్‌ చెయ్యొద్దు. నేరుగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు తీసుకెళ్లండి. ల్యాండ్‌ చేశారో ప్రయాణికులు చనిపోతున్న శబ్దాలు వింటారు. ఇది జోక్‌ కాదు. కార్గో ఏరియాలో పేలుడు పదార్థాలున్నాయి’ అని లేఖలో ఉంది. దీంతో విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. అనంతరం ప్రయాణికులను దించేసి తనిఖీలు చేసారు. ఈ విమానంలో 115 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. కాగా బెదిరింపు లేఖను విమానంలో పెట్టిందెవరో గుర్తించినట్లు పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు తెలిపారు. లేఖను పెట్టిన వ్యక్తిని గుర్తించాం.అతడిపై చర్యలు తీసుకున్నాం. ఆ వ్యక్తి పేరును అన్ని ఎయిర్‌లైన్‌ సంస్థలు తమ నిషేధిత వ్యక్తుల జాబితాలో చేర్చాలి.’ అని కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజు ట్వీట్లు చేశారు. అయితే ఆ వ్యక్తి పేరును కేంద్రమంత్రి వెల్లడించలేదు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం