తెలంగాణాలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షల పథకం


టాటా ట్రస్ట్ సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహించే కొత్త పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. తెలంగాణ వ్యాధి నిర్ధారణ పరీక్ష (టీ-డయాగ్నస్టిక్స్‌) పేరిట త్వరలో పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, నిర్ధారణ పరీక్ష కేంద్రాల మాదిరిగా.. అన్ని పరీక్షల ఫలితాలనూ ఆన్‌లైన్‌లోనే పొందే వెసులుబాటును ఈ పథకం ద్వారా కల్పిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌(ఐపీఎం) ఆవరణలో ప్రస్తుతమున్న ప్రయోగశాలకు అదనంగా మరో అధునాతన నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని నెలకొల్పనుంది. హైదరాబాద్‌ మహానగర పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులన్నీ ఈ కేంద్రీకృత ప్రయోగశాల పరిధిలోకి వస్తాయి. తొలుత హైదరాబాద్‌ కేంద్రంగా ప్రయోగాత్మకంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించి..ఆ తర్వాత దశల వారీగా అన్ని పాత జిల్లాల కేంద్రాలకు సేవలను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని టాటా ట్రస్టు అందించనుంది. ఈ మేరకు ట్రస్టుతో తెలంగాణ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఏడాది డిసెంబరు 15 నాటికి హైదరాబాద్‌ కేంద్రంగా ఈ పథకాన్ని ప్రారంభించడానికి వైద్యఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం