మమతా బెనర్జీ సర్కారుకు సుప్రీం కోర్టు చివాట్లు


ఆధార్‌ పిటిషన్‌ విషయంలో పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్రాలు పిటిషన్‌ ఎలా వేస్తాయని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని సూచించింది. పలు సంక్షేమ పథకాలకు ఆధార్‌ను అనుసంధానిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేగాక బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ నంబర్లకు ఆధార్‌ తప్పనిసరి అని పేర్కొంది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ్‌బంగా ప్రభుత్వం కూడా పిటిషన్‌ దాఖలు చేసింది. వీటిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.

పశ్చిమ్‌బంగా ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ వాదనలు వినిపించారు. అయితే ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్లమెంట్‌ ఆదేశాలను ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా సవాలు చేస్తుందని ప్రశ్నించింది. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యక్తులు పిటిషన్‌ వేయొచ్చు గానీ.. రాష్ట్రాలు వేయకూడదని పేర్కొంది. మమతాబెనర్జీ వ్యక్తిగతంగా పిటిషన్‌ వేస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. కాగా మొబైల్‌ నంబర్‌కు ఆధార్‌ను అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వేసిన మరో పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా కేంద్రం తమ స్పందన తెలియజేయాలని పేర్కొంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం