రాజాను స్టేషన్ కి తరలించిన పోలీసులు.. రామచంద్రాపురంలో ఉద్రిక్తత


వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్సై కె.నాగరాజు ఆదివారం దౌర్జన్యం చేశారు. పార్క్‌ చేసిన కారును తీయనందుకు ఆగ్రహించిన ఎస్సై రాజా కాలర్‌ పట్టుకుని లాగారు. పోలీస్‌ జీపు ఎక్కించారు. స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత కూడా రాజాపై పోలీసులు ప్రతాపం చూపారని వైకాపా వర్గాలు విమర్శిస్తున్నాయి. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భార్య రాజశ్రీ, ఐదు నెలల కుమార్తెతో కలసి రాజా ఆదివారం సాయంత్రం ద్రాక్షారామం నుంచి రాజమహేంద్రవరం వైపు కారులో వస్తూ మధ్యలో రామచంద్రపురం మసీదు సెంటర్‌ వద్దనున్న నగల దుకాణం వద్ద కారు ఆపారు. చంటిపాపను రాజాకు అప్పగించిన ఆయన భార్య నగల షాపులోకి వెళ్లారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్డు కావడంతో వాహనాలను క్రమబద్ధీకరిస్తూ అక్కడికి వచ్చిన ఎస్సై నాగరాజు.. కారు తీయమన్నారు. వెంటనే తీసేస్తానని రాజా చెప్పగా ఇప్పుడే తీయాలన్నారు. తాను మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు కుమారుడినని, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడినని రాజా చెప్పడంతో ఎస్సై మరింత పట్టుదల ప్రదర్శించి తక్షణం కారు తీయాలని స్పష్టం చేసారు. దీంతో ఇరువురికీ వాగ్వాదం జరిగింది. చంటిపాప ఉందని కూడా చూడకుండా ఎస్సై రాజాను కాలర్‌ పట్టుకొని కారు లోపలి నుంచి బయటకు లాగారు. ఇంతలో నగల షాపు నుంచి వచ్చిన రాజశ్రీ చంటిబిడ్డను తీసుకున్నారు. అనంతరం పోలీసులు రాజాను తమ వాహనం ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎస్సై తీరును నిరసిస్తూ రాజశ్రీ రోడ్డుపై కారు వద్దే కూర్చున్నారు. ఇది తెలిసిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, రాజా తల్లి జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు తదితరులు రామచంద్రపురం పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. ఆందోళనకారుల్లో కొందరు అక్కడున్న టెంట్లను తగలబెట్టారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఇరువర్గాలతో చర్చించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం