నదీ జలాల చౌర్యానికి చైనా కుట్ర

నదీ జలాలను చౌర్యం చేసి భారత్, బంగ్లాదేశ్ రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచే ఏర్పాట్లకు చైనా దిగుతున్నది. వెయ్యి కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని ఇందుకోసం తవ్వేందుకు ఆ దేశ ఇంజినీర్లు గత మార్చిలో ప్రతిపాదనలు రూపొందించారు. అరుణాచల్‌ప్రదేశ్‌కు సమీప టిబెట్‌ నుంచి బ్రహ్మపుత్ర నదీ జలాలను ఎడారి ప్రాంతం షిన్‌జియాంగ్‌కు తీసుకుపోయి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవాలని చైనా ప్రయత్నిస్తున్నది. ఇది జరిగితే  బ్రహ్మపుత్ర నది దిగువనున్న భారత్‌, బంగ్లాదేశ్‌లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదంతో పాటు హిమాలయాల ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత దెబ్బ తింటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
           బ్రహ్మపుత్ర నదిని చైనా వైపు ‘యార్లంగ్‌ సాంగ్పా’ అని పిలుస్తారు. టిబెట్‌ పీఠభూముల నుంచి ప్రవహించే ఈ నది మన అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రవేశిస్తోంది. ఇప్పుడు ఈ నదిని మన భూభాగాలకు అత్యంత చేరువ నుంచే తరలించుకుపోవాలని చైనా సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగం నిర్మాణానికి ఆకృతులు(డిజైన్లు) కూడా సిద్ధం అయ్యాయి. ఇప్పటికే బ్రహ్మపుత్రా నదిపై చైనా పలు ప్రాజెక్టులు నిర్మించింది. వీటికి భారత్‌ తీవ్ర అభ్యంతరం కూడా తెలిపింది. అయితే, నదీ ప్రవాహానికి ఆటంకం కలిగించబోమని, అవి నీటిని నిల్వచేసే జలాశయాలు కాదని చైనా ఇప్పటివరకూ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా  సొరంగ మార్గం నుంచే జలాలను తరలించుకుపోవటానికి కుట్ర చేస్తున్నది. దక్షిణ టిబెట్‌లోని సాంగ్రి కౌంటీ (అరుణాచల్‌ప్రదేశ్‌ చేరువలో) నదీ భూగర్భం నుంచి ఈ సొరంగం తవ్వకానికి అనువైనదిగా చైనా ఇంజినీర్లు గుర్తించారు. ఈ సీక్రెట్ ప్రాజెక్ట్ వివరాలను హాంకాంగ్‌ నుంచి వెలువడే ‘సౌత్‌చైనా మార్నింగ్‌పోస్ట్‌’ వెల్లడించింది. సుమారు 100 మంది శాస్త్రవేత్తలు ఈ భారీ ప్రాజెక్టుపై నిశితంగా అధ్యయనం చేస్తున్నట్లు ఆ పత్రిక తెలిపింది.