ఈజీ బిజినెస్ ర్యాంకింగ్ లో భారత్ మెరుగైన ప్రదర్శన

 

ప్రపంచ బ్యాంక్‌ వెలువరించిన ర్యాంకింగ్స్‌లో సరళతర వాణిజ్యంలో భారత్‌100వ స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే 30 ర్యాంకులు మెరుగుపడ్డాయి.. ఇదో విశేషం. పన్ను చట్టాల్లో సంస్కరణలు, లైసెన్సింగ్‌ విధానం, పెట్టుబడుదారులకు భద్రత, దివాళా చట్టం వంటివి ర్యాంకు మెరుగుదలకు దోహదం చేశాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా వృద్ధిరేటు తగ్గిందన్న విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఈ నివేదిక ప్రభుత్వానికి బలం పెంచుతుంది. 190 దేశాలకు గాను ‘డూయింగ్‌ బిజినెస్‌ 2018: రిఫార్మింగ్‌ టు క్రియేట్‌ జాబ్స్‌’ పేరిట వెలువరించిన వార్షిక నివేదికలో ఈ ఏడాది భారత్‌ 100వ స్థానంలో నిలిచింది. టాప్‌-100లో నిలిచిన భారత్‌కిదే అత్యుత్తమ ర్యాంకు. అంతకుముందు ఏడాది భారత్‌ స్థానం 130. ఈ ఏడాది ఒకేసారి ఇన్ని ర్యాంకులు మెరుగుపరుచుకుని ముందుకొచ్చిన దేశమూ భారత్ ఒక్కటే. ఈ జాబితాలో వ్యాపారాన్ని సులభంగా ఏర్పాటు చేయగల దేశంగా న్యూజిలాండ్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో సింగపూర్‌, డెన్మార్క్‌, దక్షిణ కొరియా, హాంగ్‌కాంగ్‌ నిలిచాయి. అమెరికా, బ్రిటన్‌ ఆరేడు స్థానాల్లో ఉన్నాయి. బ్రిక్స్‌ దేశాల్లో రష్యా 35వ స్థానంతో ఉండగా,  చైనా 78వ స్థానంలో ఉంది.