"గువామ్ కిల్లర్" పై అమెరికా నిఘా నేత్రం

‘గువామ్‌’ ఈ పేరు ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్నది. ఇంతకీ గువామ్ ఏమిటి? ఇదొక దీవి. ఈ మధ్యనే ఈ దీవిని నామరూపాల్లేకుండా చేస్తామని ఉత్తర కొరియా అధినేత కిమ్‌ హెచ్చరించారు. ఇది వినగానే అమెరికా ఉలిక్కిపడింది. నిజానికి ఈ హెచ్చరిక తర్వాతే ఉత్తర కొరియా, అమెరికా మధ్య విభేదాలు యుద్ధం స్థాయికి దిగజారాయి. గువామ్ దీవి అమెరికా అధీనంలో ఉన్న ఒక వ్యూహాత్మక స్థావరం. దీనిపై ఇప్పుడు అమెరికాలో కొత్త సందేహాలు తలెత్తాయి. గువామ్‌ దీవి ఉత్తర కొరియా లక్ష్యమా లేక చైనా లక్ష్యమా అని ఇపుడు అమెరికా సందేహిస్తోంది. ఎందుకంటే నిజానికి ఉత్తర కొరియాకి ఆ అవసరం కానీ అంత సీన్ కానీ లేవు. ఈ దృష్ట్యా చైనానే వెనకుండి ఉత్తర కొరియాని ప్రోత్సహిస్తోందన్న అనుమానాలు

అమెరికాలో బలపడుతున్నాయి. అమెరికా రక్షణ అధికారులు మంగళవారం చేసిన ఒక ప్రకటన సారాంశం చూస్తే గువామ్ పై చైనా పాత్ర విషయంలో వారొక నిర్ధారణకు వచ్చినట్టే కనిపిస్తున్నది. చైనా యుద్ధవిమానాలు అమెరికాకు చెందిన గువామ్‌ దీవిపై దాడికి సుదీర్ఘ కసరత్తు చేసినట్టు ఆ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా-అమెరికాలు పరస్పరం విభేదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ప్రకటన ఇరుదేశాల సంబంధాలను మరింత క్షీణింపజేస్తుంది. ఇటీవల చైనాకు చెందిన హెచ్‌-6కే బ్యాడ్జర్‌ యుద్ధవిమానాలు అసాధారణ విన్యాసాలు చేయడం అమెరికా గమనించింది. దీంతో నిఘాపెట్టిన అమెరికాకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. గువామ్‌ ద్వీపంపై దాడి ఈ విన్యాసాల ఆంతర్యమని గుర్తించిన అమెరికా దిగ్భ్రమకు లోనైంది. ఇలాంటి యుద్ధవిమానాలనే చైనా అమెరికాకు చెందిన హవాయి ద్వీపం సమీపంలోకి కూడా తరలించింది. ఈ విమానాలకు ఇటీవలే 1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణులను కూడా అమర్చారు. అన్నిటికంటే విచిత్రం... 2015లో చైనా పరీక్షించిన మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణి డీఎఫ్‌-26ను ‘గువామ్‌ ఎక్స్‌ప్రెస్‌’ అని ‘గువామ్‌ కిల్లర్‌ ’అని చైనా పేర్కొనడం.

ముఖ్యాంశాలు