పాఠశాల ఆటోలకు నమోదు తప్పనిసరి

విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్తున్న ఆటోల వివరాలను విద్యాలయాల యాజమాన్యాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం వాహన చట్టంలో సవరణలు చేసింది. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఆటోల్లో ప్రయాణించే విద్యార్థులు, డ్రైవర్ చిరునామాతో పాటుగా పూర్తి వివరాలను యాజమాన్యాలు తమ దగ్గర ఉంచుకోవాలి. రవాణాశాఖ అధికారులు విద్యాశాఖాధికారులకు, పాఠశాలలకు, ఆటో యూనియన్ సంఘాలకు కొత్తగా వచ్చిన నిబంధనల వివరాలపై నోటీసులను జారీ చేశారు. ఆటోల్లో పిల్లలను పంపిస్తున్న తల్లిదండ్రులు నిబంధనలు కచ్చితంగా అమలవుతున్నాయో లేదో తెలుసుకోవాలని ట్రాన్స్ పోర్ట్ అధికారులు తెలిపారు. ఆటోల ముందు, వెనుక పాఠశాల ఆటో అని బోర్డు రాయాలని, పన్నెండేళ్లలోపు పిల్లలైతే ఎనిమిది మందిని, ఎనిమిది నుంచి పదేళ్లలోపు పిల్లలైతే పది మందికి మించి తీసుకువెళ్లకూడదు. పిల్లలను డ్రైవర్ పక్క సీట్లో కూర్చోపెట్టకూడదు. ఆటోకు రెండు వైపులా పిల్లలు చేతులు బయటకు పెట్టకుండా గ్రిల్స్‌ను ఏర్పాటు చేయాలి. ఆటోలకు ఇష్టానుసారంగా స్కూల్ బ్యాగులు తగిలించకూడదు. బ్యాగులను బయటకు వేలాడదీయడం, పిల్లలు చేతులు బయటకు పెట్టడం చేయనీయరాదు. పిల్లలు కూర్చోవడానికి తగినన్ని సీట్లను ఏర్పాటు చేయాలి. ఆటోకు కచ్చితంగా ఎఫ్‌సీ చేయించుకోవాలి. పర్మిట్, రోడ్డు టాక్స్ కచ్చితంగా చెల్లించాలి. ఐదు కిలోమీటర్లలోపు ఉన్న పాఠశాలలకు మాత్రమే ఆటోలో పిల్లలను పంపించాలి. చిన్నారులను తీసుకువెళ్తున్న ఆటో కచ్చితంగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఇచ్చిన నంబర్‌ను కలిగి ఉండాలి. డ్రైవర్ చిరునామా, కుటుంబ నేపథ్యం, గతంలో ప్రమాదాలు చేసిన సంఘటనలు ఉన్నాయో, లేవో పేరెంట్స్ కమిటీ చూసుకోవాలి. తల్లిదండ్రులు పది రోజులకోసారి పాఠశాలలకు వెళ్లి ఆటో డ్రైవర్ పనితీరుపై ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకోవాలి. పాఠశాల యాజమాన్యం నెలకోసారి ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేయాలి. ఇక ఆటో డ్రైవర్ కచ్చితంగా ఏ.ఆర్.లైసెన్స్, బ్యాడ్జి కలిగి ఉండాలి. యూనిఫారమ్ ధరించాలి. కనీసం మూడేళ్ల నుంచి ఆటో నడుపుతూ ఉండాలి. ఏఏ పాఠశాలలకు పిల్లలను తీసుకెళ్తున్నారు? ఏ మార్గంలో వెళ్తున్నారనే విషయాన్ని ఆటోలో బోర్డును ఏర్పాటు చేయాలి. ఇంటి వరకు ఆటో వెళ్లకపోతే డ్రైవరే పిల్లలను రోడ్డు దాటించి ఇంటి వరకు తీసుకెళ్లాలి. మరో డ్రైవర్‌ను పంపించినప్పుడు, అతని వ్యక్తిగత వివరాలను, తల్లిదండ్రులకు యాజమాన్యాలకు తెలియజేయాలి. డ్రైవర్ ఫోన్ నెంబర్, లైసెన్సు నెంబర్, వ్యక్తిగత వివరాలను ఆటోల్లో ఉండేటట్లుగా బోర్డును ఏర్పాటు చేయాలి.