బాలుడి కిడ్నాప్ కధ సుఖాంతం


భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో నిన్న జరిగిన కిడ్నాప్ కధ సుఖాంతమైంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి. కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ తెలిపిన వివరాలు ప్రకారం పశ్చిమ గోదావరిజిల్లా భీమవరం పట్టణానికి చెందిన మామిడి శ్యామ్ గౌతమ్(4) స్థానికంగా యూ కె జి చదువుతున్నాడు. ఈ బాలుడిని నిన్న ఉదయం 11.30 కి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం 5లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు 12 గంటలు తిరక్కుండానే ఈ కేసును ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరి లో ముగ్గురు మైనర్లు కావడం విశేషం. వారివద్దనుండి ఒక కారు, 2 ద్విచక్ర వాహనాలు, సర్జికల్ బ్లేడ్, 5 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్మీడియట్ లో స్నేహితులు గా ఉన్న మిత్ర త్రయం సులువుగా డబ్బు సంపాదించడం కోసం బాలుడిని కిడ్నాప్ చేశారు. మొదట స్కూలుకు వెళ్లి బంధువునని నమ్మించి ఆపై మావయ్య కు ప్రమాదం జరిగింది అని బాలుడుని స్కూల్ నుండి అపహరించారు. పోలీసులకు దొరక్కుండా కారులో భీమవరం పట్టణంలో తిరుగుతూ కాయిన్ బాక్స్ ల నుండి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. కుటుంబంలో లేక లేక కలిగిన సంతానం కావడంతో తల్లిదండ్రులు డబ్బు సిద్దం చేశారు. నగరంలో ఉన్న సి.సి.కెమెరాల సహాయం తో పోలీసులు ఆ కార్ ను గుర్తించారు. ఉండి భీమవరం రోడ్డులో ఒక కారు రోడ్డు ప్రక్కనే ఉండటం గమనించిన పోలీసులు తనిఖీ చేయగా అర్ధరాత్రి సమయంలో వారికి బాబు క్షేమంగా దొరికాడు. దీంతో కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. పది గంటల పాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన కిడ్నాపర్లను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నిందితులు వ్యసనాలకు బానిసలై డబ్బు కోసం కిడ్నాప్ కి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం