మీట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు


అమరావతి : మీట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలనీ, ఈ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో మాంస పరిశ్రమ అభివృద్ధి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న బుధవారం జ‌రిగిన‌ మంత్రివ‌ర్గ స‌మావేశం పలు నిర్ణ‌యాలు తీసుకున్నది. అంతర్గత జలరవాణా చట్టం-1917 కింద ‘ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా’ రూపొందించిన మోడల్ ‘ఇన్‌ల్యాండ్ వెస్సల్స్ రూల్స్-2013’ ఆధారం చేసుకుని దానికి నిర్ధిష్ట నిబంధనలు చేరుస్తూ "ఆంధ్రప్రదేశ్ ఇన్‌ల్యాండ్ వెస్సల్స్ రూల్స్-2017"ను రూపొందించారు. కాకినాడ పోర్టుల డైరెక్టర్ చేసిన ఈ ప్రతిపాదనను పరిశీలించిన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తిరుపతిలో సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు ఆమోదం తెలిపింది. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు రుణం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. కైక‌లూరులో సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు 25 పోస్టుల మంజూరుకు ఆమోదం ల‌భించింది. విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలను చేపట్టేందుకు APPSCకి అదనపు అధికారం కల్పించేందుకు దోహదపడే బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది.

ముఖ్యాంశాలు