పాక్ ఉగ్ర మూకలు ఇవే !

భారత్, అఫ్గానిస్థాన్‌లో విధ్వంస లక్ష్యంతో పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 20 ఉగ్రవాద సంస్థల వివరాలను తాజాగా అమెరికా విడుదల చేసింది. పాక్‌కు కూడా అగ్రరాజ్యం ఈ జాబితాని పంపింది. ఈ జాబితాలో హక్కానీ నెట్వర్క్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హెచ్‌యూఎం వంటి సంస్థల పేర్లు ఉన్నాయి. హక్కానీ గిరిజన ప్రాంతాల నుంచి కార్యకలాపాలు సాగిస్తూ అఫ్గన్‌పై దాడులు చేస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను అమెరికా మూడు గ్రూపులుగా విభజించింది. ‘అఫ్గన్‌లో దాడులు చేసేవి, పాక్‌లోనే విధ్వంసం సృష్టించేవి, కశ్మీర్ లక్ష్యంగా దాడులు చేసేవి’ అనే మూడు గ్రూపులు వీటిలో ఉన్నాయి. హర్కతుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్, లష్కరే తోయిబా భారత్ లక్ష్యంగా కుట్రలు పన్నుతున్నాయని అమెరికా గుర్తించింది. జైషే మహ్మద్ కశ్మీర్లో హింసకు ప్రత్యేకం. లష్కరే దక్షిణాసియాలోనే ప్రమాదకర ఉగ్రవాద సంస్థ అని ఐరాస కూడా ముద్ర వేసింది. లష్కరే భారత పార్లమెంటు, ముంబై దాడులలో దోషి. పాక్‌లోనూ ఇది వందలాది మందిని చంపుతోందని అమెరికా నిర్ధారించింది. తెహ్రీకీ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) వివిధ మిలిటెంట్ గ్రూపుల కలయికతో ఏర్పడింది. ఇది ఇప్పుడు అఫ్గన్ లో పని చేస్తున్నా, గతంలో పాక్‌లో దాడులు చేసింది. అమెరికా విదేశాంగమంత్రి రెక్స్ టిల్లర్సన్ ఇటీవల పాక్‌లో పర్యటించినప్పుడు 75 మంది ఉగ్రవాదుల పేర్లతో కూడిన జాబితాను ఆ ప్రభుత్వానికి అందించి చర్యలు తీసుకోమని సూచించారు.