విశాఖ నుంచి ఇక అంతర్జాతీయ కార్గో రవాణా


విశాఖపట్నం : విశాఖ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ కార్గో రవాణాకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరక్టర్ జనరల్ నుంచి బుధవారం అనుమతులు వచ్చాయి. విశాఖ ఎయిర్‌పోర్ట్ డైరక్టర్ ప్రకాష్‌రెడ్డి ఈ విషయం తెలియచేశారు. ఇంటర్నేషనల్ కార్గో రవాణా కోసం మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తుంటే ఇప్పటికి సాధ్యపడింది. ఉత్తర కోస్తా జిల్లాల నుంచి వివిధ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఇప్పటివరకు చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల వరకూ వెళ్లాల్సి వస్తోంది. దీనివలన పెద్దఎత్తున డబ్బు, సమయం కూడా వృథా అవుతున్నాయి. ఇప్పుడిక విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ఇంటర్నేషనల్ కార్గో రవాణాకు అనుమతి మంజూరు కావడంతో ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని ఫార్మా కంపెనీల నుంచి సుమారు నాలుగు వేల టన్నులు ఏటా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అలాగే విశాఖలోని బ్రాండిక్స్ కంపెనీ వారానికి 40 టన్నుల బట్టలు యుఎస్‌ఎకి ఎగుమతి చేస్తోంది. నెలకు 2000 కోట్ల బంగారం విశాఖ ఎయిర్‌పోర్టులో దిగుమతి అవుతోంది. అలాగే ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి తయారైన ఉత్పత్తులు, కడియం నుంచి పువ్వులు, పండ్లు సింగపూర్, మలేషియాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇవన్నీ ఇంతవరకూ చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి వెళుతున్నాయి. ఇప్పటినుంచి ఇవి విశాఖ నుంచే విమానం ఎక్కే వీలుంది. విశాఖ నుంచి సింగపూర్, శ్రీలంక, మలేషియా, దుబాయ్ తదితర దేశాలకు నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ విమానాల ద్వారా చిన్న మొత్తంలో మాత్రమే కార్గోను ఎగుమతి, దిగుమతి చేస్తున్నారు. గురువారం నుంచి పెద్ద మొత్తంలో ఈ పనులకు వెసులుబాటు కలుగుతున్నది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజు, విశాఖ ఎం.పి.హరిబాబు చొరవ, కృషితో ఇది సాకారమైంది.

ముఖ్యాంశాలు