సంస్కరణలే వ్యాపార అనుకూల దేశంగా మార్చాయి


ఈజీ డూయింగ్ బిజినెస్ దేశాల జాబితాలో భారత్ స్థానం మెరుగుపడిన నేపథ్యంలో ప్రధాని దానిని ప్రచారాస్త్రంగా మారుస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్యల వలన భారత్ పారిశ్రామికంగా పతనమైందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఏడాదిగా చేస్తున్న విషప్రచారం నేపథ్యంలో ఈ పరిణామం బిజెపి సర్కారుకు బ్రహ్మాస్త్రం అనే చెప్పాలి. సులభ వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్‌ స్థానం ఏకకాలంలో 30 స్థానాలు మెరుగుపడటం, ఆర్ధిక సంస్కరణల ఫలితమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దీని వల్ల దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు అపార అవకాశాలు లభిస్తాయని, ఆయా సంస్థలు వృద్ధి చెందుతాయని ప్రధాని తెలిపారు. ‘గతేడాది మన దేశ ర్యాంక్‌ 130. ఏడాది వ్యవధిలో ఒకేసారి 30 స్థానాలు పైకి వెళ్లడం గర్వించదగ్గ విషయం. ర్యాంకు ఇచ్చేందుకు 10 అంశాలను పరిగణనలోకి తీసుకోగా, 6 అంశాల్లో భారత్‌ స్థానం మెరుగుపడింది. అంతర్జాతీయంగా ఉత్తమ కార్యాచరణ విధానాలకు ఇవి సమీపంలో ఉన్నాయి’ అని లింక్డ్‌ఇన్‌లో మోదీ పేర్కొన్నారు. దక్షిణాసియా దేశాల్లో, బ్రిక్స్‌ దేశాల్లో భారత్‌ ఒక్కటే ఈ ఘనత సాధించిందని వివరించారు. భారత్‌ ఏకతాటిపై నిలిచి, పలు రంగాల్లో చేపట్టిన సంస్కరణల ఫలితంగానే, సమున్నతస్థాయికి ఎదిగినట్లు మోదీ తెలిపారు. వ్యాపార ప్రారంభం, నిర్వహణను సులభతరం చేసేందుకు గత మూడేళ్లుగా దేశంలోని వివిధ రాష్ట్రాలు కూడా సానుకూల దృక్పథంతో పోటీపడుతున్నాయని ప్రధాని ప్రశంసించారు. పెట్టుబడుల ఆకర్షణకు దేశ, విదేశాల్లోని పెద్ద కంపెనీలను ఆహ్వానించి నిర్వహిస్తున్న సదస్సుల వల్ల, సానుకూల ఫలితాలు వస్తున్నాయన్నారు.

ముఖ్యాంశాలు