ఐఒసి టార్గెట్లపై డీలర్ల అసంతృప్తి


పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన అదనపు వ్యాట్‌ తగ్గింపుపై జరుగుతున్న జాప్యం ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు, పెట్రో డీలర్లకు మధ్య వివాదంగా మారింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) కొనుగోళ్లకు అధిక టార్గెట్లను విధిస్తోందంటూ ఐవోసీ పెట్రోల్‌ బంకు డీలర్లు బుధవారం రాత్రి ఆకస్మిక సమ్మెకు దిగారు. టార్గెట్ మేరకు కొనుగోళ్లు చేయనందుకు ఐవోసీ ఒకటో తేదీన డీలర్లకు ఆయిల్‌ సరఫరా నిలిపివేయడంతో దీనికి నిరసనగా తాము ఐవోసీ బంకులను మూసివేసి సమ్మెకు దిగినట్లు డీలర్లు చెబుతున్నారు. అయితే ఐవోసీ అధికారులు వెనువెంటనే డీలర్లతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించడంతో సమ్మె కాస్సేపటికి ముగిసింది. కనీస వేతనాల చెల్లింపు, సౌకర్యాలు లేకుంటే జరిమానాల విధింపుపై ఆయిల్‌ కంపెనీలు తెచ్చిన సవరణలను సవాల్‌ చేస్తూ ఉభయ రాష్ట్రాల పెట్రోల్‌ డీలర్ల సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను ఇవ్వాలని ఇరు రాష్ట్రాలతో పాటు కేంద్రం, ఆయిల్‌ కంపెనీలను ఆదేశిస్తూ హైకోర్టు నోటీసులిచ్చింది.