నష్టాలు నమోదు చేసిన ఆంధ్రాబ్యాంకు


ఆంధ్రా బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి రూ.385 కోట్ల నష్టాన్ని మూటగట్టుకొంది. బ్యాంకు మొత్తం వ్యయాలు రూ.3,999 కోట్ల నుంచి రూ.3,710 కోట్లకు తగ్గినప్పటికీ మొండి బకాయిలకు (ప్రొవిజన్లు, కంటిజెన్సీస్‌) కేటాయింపులు అధికంగా ఉండడంతో బ్యాంకు నష్టాల పాలైంది. 2017, సెప్టెంబర్ తో ముగిసిన మూడు నెలలకు పారు బకాయిల కోసం బ్యాంకు రూ.1,680 కోట్లు కేటాయించింది. ఏడాది క్రితం ఇదే కాలం కేటాయింపులు రూ.992 కోట్లతో పోలిస్తే 69.36 శాతం అధికం. సమీక్ష త్రైమాసికానికి నికర వడ్డీ ఆదాయం 10.46 శాతం వృద్ధితో రూ.1,359 కోట్ల నుంచి రూ.1,501 కోట్లకు చేరిందని బ్యాంకు తెలిపింది. మొత్తం ఆదాయం రూ.5,005 కోట్లుగా నమోదైంది. ఏడాది క్రితం ఇదే కాలం ఆదాయం రూ.5,043 కోట్లతో పోలిస్తే 0.75 శాతం తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి బ్యాంకు రూ.345 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి బ్యాంకు నికర నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) నిష్పత్తి 7.55 శాతానికి తగ్గింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇది 8.09 శాతం ఉంది. సమీక్ష త్రైమాసికం నాటికి నికర ఎన్‌పీఏలు రూ.10,574 కోట్ల మేరకు ఉన్నాయి. స్థూల ఎన్‌పీఏల నిష్పత్తి 13.27 శాతం కాగా, స్థూల ఎన్‌పీఏలు రూ.19,839 కోట్ల మేరకు ఉన్నట్లు బ్యాంకు తెలిపింది. నికర వడ్డీ మారిన్‌ ఏడాది క్రితంతో పోలిస్తే 3.11 శాతం నుంచి 3.21 శాతానికి పెరిగింది. డిపాజిట్ల సమీకరణ వ్యయం 6.55 శాతం నుంచి 5.62 శాతానికి పరిమితమైంది. ఏడాది క్రితంతో పోలిస్తే 2017, సెప్టెంబరు చివరి నాటికి బ్యాంకు వ్యాపారం 7.8 శాతం పెరుగుదలతో రూ.3.19 లక్షల కోట్ల నుంచి రూ.3.44 లక్షల కోట్లకు చేరింది. మొత్తం డిపాజిట్లు 9.5 శాతం పెరుగుదలతో రూ.1.94 లక్షల కోట్లకు, రుణాలు 5.6 శాతం వృద్ధితో రూ.1.49 లక్షల కోట్లకు చేరాయి. కాసా డిపాజిట్లలో 24.9 శాతం వృద్ధి నమోదైంది. బ్యాంకు వద్ద మొత్తం రూ.59,988 కోట్ల కాసా డిపాజిట్లు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్ల నిష్పత్తి 27.06 శాతం నుంచి 30.86 శాతానికి పెరిగింది. రిటైల్‌ రుణాలు..: ఏడాది క్రితంతో పోలిస్తే 2017, సెప్టెంబరు చివరి నాటికి బ్యాంకు రిటైల్‌ రుణాల పోర్టుఫోలియో 28 శాతం వృద్ధితో రూ.32,526 కోట్లకు పెరిగింది. చిన్న, మధ్య స్థాయి సంస్థలకు ఇచ్చిన రుణాలు రూ.30,831 కోట్లకు చేరాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో ఈ పోర్టుఫోలియో రూ.24,181 కోట్లతో పోలిస్తే 27.5 శాతం మేరకు పెరిగింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం