ఎన్టీఆర్ తో జగన్ కి పోలికా..! అసెంబ్లీ బహిష్కరణ అనుచితం : ఉండవల్లి


ఆనాడు ఎన్టీఆర్ శాసన సభను బహిష్కరించడంతో ఇపుడు జగన్ పోల్చుకోవడం సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ అభిప్రాయపడ్డారు. నిజానికి అప్పట్లో ఎన్టీఆర్ సభను బహిష్కరించి చేసిన పని సినిమాలు తీసుకోవడం అని, మిగిలిన టిడిపి సభ్యులు సభకు వెళ్లారని అన్నారు. ప్రజా సమస్యల పై చర్చకి వేదిక అయిన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం తప్పిదమే అవుతుందని పేర్కొంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని విమర్శించారు. ఇలా చేయడం వలన చంద్రబాబుకి మేలు చేసినట్లే కాగలదన్నారు. రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో శుక్రవారం ఉదయం చెరుకూరి వెంకటరామారావు, లింగంపల్లి వెంకటేశ్వరరావు,కృష్ణ తదితరులతో అయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాదయాత్ర పేరిట అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం అనుచితమన్నారు. సమావేశాలు ప్రారంభం అయ్యాక, కొన్ని రోజులు పాల్గొని, ఆతర్వాత పాదయాత్రకు వెళ్లవచ్చని సలహా ఇచ్చారు. ఆతర్వాత మిగిలిన నాయకులు అసెంబ్లీలో వ్యూహాత్మకంగా సమస్యలు చర్చించేలా చూడాలని కూడా సూచించారు. నంద్యాల ఉప ఎన్నిక లో డ్వాక్రా సంఘాలకు రూ 4వేలు చొప్పున ప్రభుత్వం ఖాతాలో వేసిందని , అయితే ఇంతవరకూ ఏ జిల్లాలో ఎక్కడ ఎందుకు వేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ఎన్నో సమస్యలు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షం నిలదీయాల్సి ఉండగా జగన్ గైర్హాజరవడం వలన సభ ఏకపక్షంగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేసారు. పోలవరంపై అనుసరిస్తున్న ధోరణి శోచనీయం పోలవరం విషయంలో అటు కేంద్రం ఇటు రాష్ట్రం అనుసరిస్తున్న ధోరణి శోచనీయమని ఉండవల్లి అన్నారు.

ముఖ్యాంశాలు