కంబాలచెరువు పార్కుకి పూర్వవైభవం తెస్తాం : గన్ని

Rajamahendravaram

: కంబాలచెరువు పార్కుకి వచ్చే వర్షాకాలంలోపు పూర్వ వైభవం తీసుకువస్తామని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. 5వ డివిజన్‌ కార్పొరేటర్‌ తలారి ఉమాదేవి, 36వ డివిజన్‌ కార్పొరేటర్‌ తంగెళ్ళ బాబి, డిప్యూటీ కమిషనర్‌ ఎం.వి.డి.ఫణిరామ్‌, ఇతర విభాగాల అధికారులతో కలిసి కంబాలచెరువు పార్కును ఆయన పరిశీలించారు. కంబాలచెరువు పార్కు నుండి దుర్వాసన వెదజల్లుతుండటంతో గన్ని ఈ పార్కుపై దృష్టిసారించారు. గతంలో కంబాలచెరువు పార్కు దుస్థితిలో ఉన్నప్పుడు శ్రమదానం పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన శ్రేణులు, స్వచ్చంద సంస్థల సహకారంతో శుభ్రపరిచామని, ఆ తరువాత నగరపాలక సంస్థ చొరవ చూపి పార్కును సుందరంగా మలిచిందన్నారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నేటి దయనీయ పరిస్థితికి చేరుకుందని ఆరోపించారు. పార్కు సుందరీకరణకు, పూర్వ వైభవం తెచ్చేందుకు నాలుగైదుసార్లు తాను, ఎమ్మెల్యే, ఇతర అధికారులు ప్రయత్నించినా అవి ఆచరణలోకి రాలేదన్నారు. అమృత్‌ పథకంలో అర్బన్‌ గ్రీనరీ ప్రాజెక్టు క్రింద కంబాలచెరువు పార్కు బ్యూటిఫికేషన్‌కు రూ.కోటి 53 లక్షలు మంజూరయ్యాయని, దీనిలో సివిల్‌, హార్టికల్చరల్‌ పనులు ఉంటాయన్నారు. ఈనెల 6న టెండర్లు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. నగరంలో డ్రైనేజీల ఆధునికీకరణకు రూ.83 కోట్లు మంజూరయ్యాయని, అందులో భాగంగా మురుగునీరు కంబాలచెరువు పార్కులోకి రాకుండా మళ్ళించడం జరుగుతుందన్నారు. నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుండి రూ.32 లక్షలు పార్కు అభివృద్ధికి మంజూరు చేశారని, త్వరలోనే ఆ నిధులతో మరమ్మత్తులు చేపట్టడం జరుగుతుందన్నారు. నగరపాలక సంస్థ ఎస్‌ఇ ఓం ప్రకాష్‌, ఇఇ సత్యకుమారి, డిఇ ప్రసాద్‌, శానిటరీ సూపర్‌వైజర్‌ నారాయణరావు, ఎఇ దేవీలలిత, నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి డాక్టర్‌ ఎం.వి.ఆర్‌.మూర్తి, తెదేపా నాయకులు తలారి భగవాన్‌, మొల్లి చిన్నియాదవ్‌ ఉన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం