కృష్ణా సోబతీకి జ్ఞానపీఠ్


ప్రముఖ హిందీ రచయిత్రి కృష్ణా సోబతీని జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు వరించింది. శుక్రవారం నిర్వహించిన ఓ సమావేశంలో ఎంపిక సంఘం (సెలక్షన్‌ బోర్డ్‌) 2017 సంవత్సరానికి గాను 53వ జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారానికి ఆమె పేరును ప్రకటించింది. 1925లో గుజరాత్‌ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న ప్రాంతం)లో జన్మించిన సోబతీ నవ్య రచనా విధానాలతో ప్రయోగాలు చేయడంలో ప్రసిద్ధురాలు. తన కథల్లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సృజనాత్మక పాత్రలకు ఆమె జీవం పోస్తుంటారు. భారత్‌-పాక్‌ విభజన, స్త్రీ-పురుషుల అనుబంధాలు, భారత సమాజ స్థితిగతులు, క్షీణిస్తున్న మానవ విలువలు ఆమె కథాంశాలు. ఆమె రచనల్లో - దార్‌ సే బిచ్చుడీ, మిత్రో మర్జనీ, జిందగీనామా, దిలో దానిష్‌, బదలోమ్‌ కే ఘేరే, ఏ లడకీ, గుజరాత్‌ పాకిస్థాన్‌ సే గుజరాత్‌ హిందుస్థాన్‌ వంటివి ఉన్నాయి. ఆమె రచనల్లో కొన్ని స్వీడిష్‌, రష్యన్‌, ఆంగ్లంలోకి కూడా తర్జుమా అయ్యాయి. పద్మభూషణ్‌తో పాటు హిందీ అకాడమీ, శిరోమణ్‌ అవార్డులు.. మైథిలీ శరణ్‌ గుప్త సమ్మాన్‌, సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌లు ఇప్పటికే ఆమెను వరించాయి.