పోలవరంపై చంద్రబాబు తీరు అనుమానాస్పదం : ఉండవల్లి

November 4, 2017

 

రాజమహేంద్రవరం : పోలవరం విషయంలో అటు కేంద్రం ఇటు రాష్ట్రం అనుసరిస్తున్న ధోరణి అయోమయాన్ని కలిగిస్తున్నదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్  అన్నారు. ఎపి రీ ఆర్గనైజేషన్ ఏక్ట్ లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి, కేంద్రమే కట్టి ఇస్తానని చెప్పినప్పటికీ, తదుపరి పరిణామాలు అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా అవుండగా, ఈ ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి,ఇందుకు అయ్యే మొత్తం ఖర్చుని కేంద్రమే భరించేలా కేంద్ర కేబినెట్ లో 2014మే 1తీర్మానం చేశారని ఆయన చెప్పారు. పెరుగుతున్న అంచనాల ప్రకారం ఖర్చు కేంద్రమే భరించాల్సి ఉందన్నారు. అయితే కేంద్రం ఇవ్వకపోయినా మనమే భరిద్దాం అంటూ చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఓపక్క కేంద్రం ఎందుకు ఇవ్వదని బిజెపికి చెందిన పురందరేశ్వరి అడుగుతుంటే, నిజంగా అడగాల్సిన చంద్రబాబు మాత్రం ఇవ్వకపోతే మనమే భరిద్దామని చెబుతున్నారంటే ఏదో లోగుట్టు ఉందన్నారు, పట్టిసీమ పై పెట్టె దృష్టిని పోలవరంపై పెడితే, ఈపాటికి చాలా పని అయ్యేదని ఉండవల్లి పేర్కొంటూ, తాను మొదటినుంచి ఈ విషయం చెబుతూనే ఉన్నానన్నారు. కాపర్ డ్యామ్ పని అసలు అవ్వలేదని,ఎర్త్ కం రాక్ ఫీల్ కేవలం 2.7శాతం క్యూబిక్ మీటర్ల పని  మాత్రమే  అయిందని, ఇంకా 12లక్షల క్యూబిక్ మీటర్ల పని మిగిలి  ఉందని, అలాంటప్పుడు 2018 నాటికి గ్రావిటీ మీద ఎలా నీళ్లు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. పైగా కేంద్రం 16వేల కోట్లకు మించి అదనంగా ఇవ్వనని అంటోందని ఆయన పేర్కొన్నారు. పురుషోత్తపట్నం, పట్టిసీమ పథకాలు పోలవరంలో అంతర్భాంగం అని చంద్రబాబు చెబుతుంటే, కేంద్ర జలసంఘం మాత్రం  ఆవిధంగా పరిగణించడం లేదని చెబుతోందని ఉండవల్లి గుర్తు చేసారు. అసలు కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్ట్ ని తానే కడతానని చంద్రబాబు నెత్తిన వేసుకుని కాంట్రాక్టర్ అవతారం ఎత్తడం అర్థరహితం అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మనకు ఇస్తానన్నవేవీ ఇవ్వకపోయినా, ప్యాకేజి పేరిట దెబ్బతీస్తున్నా, చంద్రబాబు అడగడం లేదని మండిపడ్డారు. ఇది కేంద్రం అహంకారమా, లేక చంద్రబాబు బలహీనతా అని ప్రశ్నించారు.  రాజకీయ అవసరాలు, వ్యక్తిగత అవసరాలకోసం ఇలా వ్యవహరిస్తే ప్రజలకు తీరని ద్రోహం చేసినట్లే అవుతుందని ఉండవల్లి అన్నారు. సమర్థుడని అధికారం అప్పగిస్తే, చంద్రబాబు అనుసరిస్తున్న ధోరణి దారుణంగా ఉందన్నారు. ఓ పక్క  లోటు పెరిగిపోతోందని, మరోపక్క అప్పులు విపరీతం అవుతున్నాయని బాధపడిపోతూనే ఇంకోపక్క జిడిపి పెరిగిపోతున్నట్లు చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేసారు.