కృష్ణ జలాల పంపిణీ.. తెగిన వాటాలు

నీటి పంపిణీ మినహా మిగిలిన అనేక అంశాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు పరస్పరం వాదులాటకు దిగారు. దీనితో పలు అంశాలపై తుది నిర్ణయం పెండింగ్ లో పడింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏడవ సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. బోర్డు ఛైర్మన్ శ్రీవాత్సవ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఎస్.కె.జోషి, శశిభూషణ్ కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు మురళీధర్, వెంకటేశ్వరరావు, బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం, రెండు రాష్ట్రాలు, బోర్డుకు సంబంధించిన ఇంజినీర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం నీటిని కేటాయిస్తూ బోర్డు నిర్ణయించింది. బోర్డు ఛైర్మన్ శ్రీవాత్సవ ఈ విషయాన్ని ప్రకటించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కనీస నీటిమట్టాలకుపైన ఉన్న జలాల్లో 282 టీఎంసీల నీటిని కూడా ఇదే పద్ధతిలో ఇరు రాష్ట్రాలు వినియోగించుకుంటాయన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నీటిని తక్కువగా చూపుతున్నారని, శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీరు నాగార్జునసాగర్‌కు చేరేటప్పటికి 25 శాతానికిపైగా తక్కువ రికార్డు అవుతోందని, తెలంగాణ, నాగార్జునసాగర్ ఎడమ కాలువకు విడుదల చేసిన నీటిలో ఎక్కువ శాతం ఆవిరవుతున్నట్లు చూపించి మొత్తం తమ లెక్కలోనే వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసింది. ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు, బోర్డు అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి వీరిచ్చే నివేదికల ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కు రెండు రాష్ట్రాల వాటా నుంచి తాగునీటి కేటాయించాలని తెలంగాణ కోరగా ఏపీ నో చెప్పింది. ఇది ఆచరణ సాధ్యం కాదని బోర్డు కూడా అభిప్రాయపడినట్టు సమాచారం. అలాగే పులిచింతలను ఉమ్మడి ప్రాజెక్టుగా గుర్తించాలనీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు డ్యాం శాంతిభద్రతల పర్యవేక్షణ మొత్తం తమకే అప్పగించాలన్న తెలంగాణ ప్రతిపాదనలకు కూడా ఆంధ్రప్రదేశ్ అధికారులు అంగీకరించలేదు.. ఏపీకి 215, తెలంగాణకు 115 టీఎంసీలు కృష్ణ జలాలు కేటాయిస్తూ బోర్డు తీర్మానించింది.