బినామీ ఆస్తులు కోల్పోవడం ఖాయం : ప్రధాని మోదీ


బినామీ ఆస్తులపై యుద్ధం ముగియలేదని భారత ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తమ అక్రమ ఆస్తులను విడిచిపెట్టదనే భయంతోనే కాంగ్రెస్‌ నాయకులు పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసి, భయాన్ని కలిగించాలని చూశారన్నారు. అయితే ప్రజలు దానిని తిప్పికొట్టారన్నారు. శనివారం హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా, సుందర్‌నగర్‌లలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. బినామీ ఆస్తుల్ని తమవిగా చెప్పుకోలేనంత పరిస్థితిని నేను కల్పిస్తానని, . పేదల నుంచి దోచుకున్నదానిని వారికి తిరిగి ఇవ్వాల్సిందేనని చెప్పారు. నోట్లరద్దు నిర్ణయం అమల్లోకి వచ్చిన నవంబరు 8 ని ‘నిరసన దినం’గా పాటించాలని కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని తప్పుపట్టారు. అవినీతిపై తన పోరాటాన్ని దిగమింగుకోలేక ఆరోజు బహుశా తన దిష్టిబొమ్మల్ని దహనం చేస్తారన్నారు. పేదలు, మధ్యతరగతివారు ఎప్పటిలా తమ పనులు తాము చేసుకుంటున్నా అవినీతిపరులు మాత్రం ఇంకా ఆగ్రహంతో ఉన్నారన్నారు. యూపీఏ పాలనలో అనేక కుంభకోణాలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ అలాంటి పరిస్థితుల్లో నిరసనదినాన్ని కాంగ్రెస్‌ పాటించడంలో ఔచిత్యాన్ని ప్రధాని ప్రశ్నించారు. మరో వందేళ్లు గడిచినా కూడా కాంగ్రెస్‌ పార్టీని భారతీయులు విశ్వసించబోరని స్పష్టం చేసారు. కాంగ్రెస్‌ నేతలు కొందరు రూ.500 నోట్ల మూటల్ని, మరికొందరు రూ.వెయ్యి నోట్ల మూటల్ని కోల్పోయారు. ఈలోగా బినామీ ఆస్తుల నిషేధ చట్టాన్ని తెచ్చాం. నోట్లను దాచుకున్నట్లుగా స్థలాలు, ఫ్లాట్లు, దుకాణాలు వంటివి దాచుకోవడం కుదరదనే వాయఱి భయం అని మోదీ వివరించారు. డ్రైవర్లు, వంటవాళ్ల పేరిట కార్లు, ఇళ్లు కొనుగోలుచేసిన కాంగ్రెస్‌ నేతలు అనేకమంది ఉన్నారన్నారు. ఇప్పుడు ఆ యాజమాన్యాన్ని తమకు బదలాయించమని వారు అడిగితే ఆలా చేయవద్దని ఆ నౌకర్లకు తాను చెబుతానన్నారు.