ఎటు చూసినా టి ఆకారంలో ఇమేజ్‌ టవర్స్

ఎటు చూసినా టి ఆకారంలో కనిపించే అత్యంత అధునాతన టవర్స్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నడుం కట్టింది. యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గేమింగ్‌ అండ్‌ కామిక్స్‌(ఏవీజీసీ) పరిశ్రమలకు పెద్దఎత్తున ఊతమిచ్చేందుకు

టవర్‌ నిర్మాణం చేపట్టామని ఇది రాష్ట్రానికి మరో చార్మినార్‌లా కీర్తిప్రతిష్టలు తెచ్చి పెడుతుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని పదెకరాల స్థలంలో ఇమేజ్‌ టవర్‌ నిర్మాణ పనులకు మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలసి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఏవీజీసీ పరిశ్రమలకు అత్యాధునిక సదుపాయాలు కల్పించాలన్న ప్రభుత్వ ఆశయాలకు ఇమేజ్‌ టవర్‌ అద్దం పడుతుందన్నారు. ప్రైవేటు–పబ్లిక్‌ భాగస్వామ్యంతో రూ.945 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నామని, 2020 నాటికి పూర్తవుతుందని చెప్పారు. 16 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే ఈ భవనంలో మోకాప్‌ స్టూడియోలు, ట్రీన్‌మ్యాట్‌ స్టూడియోలు, సౌండ్స్‌ అండ్‌ అక్విస్టిక్‌ స్టూడియోలు, కలర్‌ కోడింగ్‌ అండ్‌ డీఐ స్టూడియోలు, రెండర్‌ ఫారŠమ్స్, డాటా సెంటర్, హై డెఫినేషన్‌ బ్యాండ్‌ విడ్త్, షేర్డ్‌ సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌ తదితర సదుపాయాలు కల్పిస్తామన్నారు. గేమింగ్, యానిమేషన్‌ పరిశ్రమల అభివృద్ధికి ఈ భవనం చోదక శక్తిగా ఉపయోగపడుతుందన్నారు. ఏవీజీసీ రంగానికి సంబంధించి సకల సదుపాయాలను ఇలా ఒకే గొడుగు కింద అందించడం ఆసియా, ఫసిపిక్‌ దేశాల్లో ఇదే తొలిసారి అని, యూకేలోని మీడియా సిటీ, సియోల్‌లోని డిజిటల్‌ సిటీలను తలదన్నేలా ఈ భవనం ఉంటుందని పేర్కొన్నారు.