కరుణానిధితో మోదీ భేటీ


చెన్నై : ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెన్నై వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా అయన అనూహ్యంగా డీఎంకే అధినేత కరుణానిధిని కలిశారు. చెన్నై గోపాలపురంలో గల కరుణానిధి నివాసానికి వెళ్లిన మోదీ ఆయన్ని పరామర్శించారు. గతేడాది నుంచి కరుణానిధి ఆరోగ్యం బాగోలేదు. వైద్యుల పర్యవేక్షణలో ఉండటంతో ఎక్కువగా బయటకు కూడా రావట్లేదు. చాలా కాలం తర్వాత ఇటీవలే తన పార్టీ కార్యకర్తలను కలిశారు. మోదీ-కరుణానిధి భేటీ మర్యాదపూర్వకంగానే జరిగిందని, ఇది పరామర్శ మాత్రమేనని ఇరు పార్టీల వర్గాలు చెబుతున్నా తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారిన నేపథ్యంలో ప్రధాని - డీఎంకే అగ్రనేత భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే భాజపాతో పొత్తు కుదుర్చుకుంటుందేమో అన్న అనుమానాలు అప్పుడే రాజకీయ విశ్లేషకుల్లో పొడసూపుతున్నాయి. తమిళ దినపత్రిక ‘దినతంతి’ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. ఆయన ఆ సభలో మాట్లాడుతూ సమాజంలో మీడియా పాత్రను కొనియాడారు. పత్రికలు కేవలం వార్తలను మాత్రమే ప్రచురించడం లేదు. సమాజాన్ని చైతన్యపరుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మీడియా సమాజాన్ని మారుస్తోంది... అని కొనియాడారు.