డయల్‌ 1100.. ఇదే మన ప్రతిపక్షం


ఈ నెల 10వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ముఖ్య నేతలతో వెలగపూడి సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షం ఈ సభలో ఉందని కారణంగా ‘‘పరిష్కార వేదిక డయల్‌ 1100నే ప్రతిపక్షంగా పరిగణించాలని అయన అన్నారు. ఆ విభాగానికి ప్రజలు చేసే ఫిర్యాదులు, చెప్పే అభిప్రాయాలపైన అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం అని బాబు సూచించారు. ప్రతిపక్షం లేదని సమావేశాలను తేలిగ్గా తీసుకోవద్దని, సభని మరింత సజావుగా నిర్వహించాలని, మంత్రులు ప్రతి ప్రశ్నకు, చర్చకు బాగా సన్నద్ధమై వచ్చి సమాధానామివ్వాలని ఆయన సూచించారు. ఈ నెల 13న తెదేపా శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ‘ఇంటింటికీ తెదేపా కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో తిరిగినప్పుడు అనేక సమస్యలు మీ దృష్టికొచ్చుంటాయి. ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఎదురవుతున్న ఇబ్బందులు స్వయంగా తెలుసుకుని ఉంటారు. వాటన్నింటిని సభలో చర్చించాలి’’ అని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. వ్యవస్థలో లోపాలు, ప్రజా సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి ఈ సమావేశాలను ఉపయోగించుకోవాలన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని పార్టీ ఎమ్మెల్యేలంతా సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. పది పనిదినాల పాటు సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో ఈ మేరకు చర్చించాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఉపాధి హామీ పథకంలో ఎదురవుతున్న ఇబ్బందులు, నిధులు అడ్డుకునేందుకు కేంద్రానికి వైకాపా ఎంపీల లేఖలు, చంద్రన్న బీమా, పట్టిసీమ ప్రయోజనాలు, నీటి పారుదల ప్రాజెక్టులకు ఇస్తున్న ప్రాధాన్యం, వ్యవసాయంలో వృద్ధి, ఖరీఫ్‌ ప్రారంభంలో కరవు తర్వాత అధిక వర్షాలకు పంటలు నష్టపోవడం, పారిశ్రామిక పెట్టుబడులు, రాజధాని తదితర మొత్తం 28 అంశాలను సభలో చర్చించేందుకు వీలుగా గుర్తించారు. నాలుగు బిల్లులు కూడా ప్రవేశపెట్టాలనుకున్నారు. తొలి రోజున ఉదయం 9.45 గంటలకు శాసనసభ, 10.30 గంటలకు శాసనసమండలి ప్రారంభమవుతుంది. మిగతా రోజులలో శాసనసభ 9 గంటలకు, మండలి 10 గంటలకు మొదలవుతాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు సమావేశాలు ముగుస్తాయి.

ముఖ్యాంశాలు