పెద్ద నోట్ల రద్దు లాభాలివీ...


పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ‘నల్లధన నిర్మూలన దినం’గా దీనిని పాటించేందుకు ప్రభుత్వం, బ్లాక్ డే గా పాటించేందుకు ప్రతిపక్షం సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విపక్షాలకు దీటైన సమాధానమిస్తూ నోట్ల రద్దు లాభాలను ఇలా వివరించారు. కేంద్రం చేపట్టిన నోట్ల రద్దు నిర్ణయాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో ఒక ‘కీలక మలుపు’గా ఆయన అభివర్ణించారు. ఈ నిర్ణయం తర్వాత ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత, నిజాయతీ పెరిగిందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఫేస్‌బుక్‌లో ఈ అంశంపై వరుస పోస్టులు చేశారు. ‘నోట్ల రద్దు వల్ల కలిగే లాభాలు కొందరికి కనిపించవు... కానీ భవిష్యత్‌ తరాల వారు ఈ అభివృద్ధిని చూసి గర్విస్తారు. తాము నిజాయతీ గల ఆర్థిక వ్యవస్థలో జీవిస్తున్నామని, అందుకు కారణమైన 2016 నవంబర్‌ను వారు గుర్తుంచుకుంటారు.. గర్విస్తారు’ అని జైట్లీ పోస్ట్‌ చేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్క రూపాయికి లెక్క ఉందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల కలిగిన ప్రయోజనాలను ఇంకా తన పోస్టింగులో ఆయన ఇలా వివరించారు. ఈ ఏడాది ఆగస్టు 5 వరకు 56 లక్షల మంది వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులు తమ రిటర్నులు దాఖలు చేశారు. గతేడాది ఆ సంఖ్య 22 లక్షలు మాత్రమే. పెద్ద నోట్ల రద్దు తర్వాత 2.97 లక్షల డొల్ల కంపెనీలను గుర్తించడం సాధ్యపడింది. ఒక్కో కంపెనీకి వందకు పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు బయటపడింది. ఓ కంపెనీ అయితే ఏకంగా 2,134 ఖాతాలు కలిగి ఉన్నట్టు గుర్తించాం. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వినియోగం పెరిగింది. క్రెడిట్‌ కార్డుల ద్వారా రూ.3.3 లక్షల కోట్ల విలువైన 110 కోట్ల లావాదేవీలు, డెబిట్‌ కార్డు ద్వారా అంతే విలువైన 240 కోట్ల లావాదేవీలు జరిగాయి. జమ్ము కశ్మీర్‌లో రాళ్లు రువ్వే ఘటనలు తగ్గుముఖం పట్టాయి. నక్సల్స్‌ కార్యకలాపాలు చాలా వరకు నిలిచిపోయాయి.